Published : 25/01/2021 05:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మమ్మ ఆరోగ్యానికి అహరహం శ్రమించి..

రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీత వెనుక స్ఫూర్తి


పాఠశాలలో ఓ ప్రదర్శనలో హేమేష్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక రాష్ట్రీయ బాల పురస్కార్‌-2021 సాధించిన తెలంగాణ విద్యార్థి, బాల మేధావి చదలవాడ హేమేష్‌ వెనుక అతని అమ్మమ్మే స్ఫూర్తిగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ఎంపికైన 32 మంది విద్యార్థుల్లో తెలంగాణ నుంచి హేమేష్‌కు మాత్రమే ఈ ఘనత దక్కింది. శాస్త్ర, సాంకేతిక విభాగంలో కొత్త ఆవిష్కరణల విభాగంలో పురస్కారానికి ఎంపికయ్యాడు. మతిమరుపు (అల్జీమర్స్‌) రోగులకు ఉపయోగపడేందుకు వీలుగా స్మార్ట్‌ రిస్ట్‌ బ్యాండ్‌ రూపొందించాడు. కూకట్‌పల్లికి చెందిన చదలవాడ కిషోర్‌కుమార్‌, సంధ్య దంపతుల చిన్న కుమారుడు హేమేష్‌ ఫిలింనగర్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నారు. హేమేష్‌ అమ్మమ్మ జయశ్రీ గుంటూరులో ఉంటారు. ఈమె చాలా కాలంగా అల్జీమర్స్‌ వ్యాధితో బాధ పడుతోంది. ఆమె తనపై తాను నియంత్రణ కోల్పోవటం, అర్ధరాత్రి నిద్రలో లేచి వెళ్లిపోవటం వంటి సంఘటనలను విద్యార్థి కళ్లారా చూశాడు. దీనికి పరిష్కారం చూపాలనే సంకల్పంతో పరిశోధనలు ప్రారంభించాడు. అల్జీమర్స్‌ సొసైటీతో కలసి కొంత సమాచారం సేకరించాడు. అంతర్జాలం ద్వారా పరికరం (డివైస్‌) రూపకల్పనకు అవసరమైన సమాచారం క్రోడీకరించాడు. 2019లో రూ.10,000 నుంచి రూ. 20,000 ఖర్చుతో స్మార్ట్‌ రిస్ట్‌బ్యాండ్‌ ఆవిష్కరించాడు. రోగుల చేతికి(రిస్ట్‌) ఈ పరికరం బిగిస్తారు. దీని ద్వారా రోగుల శరీర ఉష్ణోగ్రత, పల్స్‌రేటు, రక్తపోటు, కదలికలను వైఫై, బ్లూటూత్‌ సహాయంతో వారి బంధువులు/స్నేహితుల చరవాణికి చేరుతుంది. అర్ధరాత్రి నిద్రలేచినా, బయటకు వెళ్తున్నా వారి కదలికలపై ఫోన్‌ ద్వారా 3 సెకన్లలో అప్రమత్తం చేస్తుంది. స్పందించకపోతే ఫోన్‌కాల్‌ ద్వారా సమాచారం చేరవేస్తుంది.


హేమేష్‌ రూపొందించిన పరికరం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని