Updated : 04/03/2021 03:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంక్లిప్త వార్తలు

ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీరందాలి

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని.. పురోగతిలో ఉన్న మిషన్‌ భగీరథ పనులను సత్వరం పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగునీరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అనిత పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా పరషత్‌ కార్యాలయంలో జిల్లా పరిషత్‌ సీఈవో దిలీప్‌కుమార్‌, వివిధ విభాగాల అధికారులు, జడ్పీటీసీలతో పనులు, ప్రణాళికలపై స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సర్వసభ్య సమావేశాలకు మండల స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. గ్రామాలకు సరఫరా అయ్యే మంచి నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్తు సబ్‌స్టేషన్‌ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. జడ్పీటీసీలు పట్నం అవినాష్‌రెడ్డి, తన్విరాజ్‌, గోవిందమ్మ, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.


రైల్వేస్టేషన్లో కొత్త పార్సిల్‌ టెర్మినల్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్లో కొత్త పార్సిల్‌ టెర్మినల్‌ సేవలు ప్రారంభమయ్యాయి. బుధవారం కాచిగూడ స్టేషన్‌ డైరెక్టర్‌ వెంకన్న, పార్సిల్‌ సూపర్‌వైజర్‌ ఖాద్రీ, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరమణ, సీసీఐ వెంకటేశ్‌తో కలిసి కొత్త పార్సిల్‌ టెర్మినల్‌ సేవలను ప్రారంభించారు. రైల్వే మంత్రిత్వ శాఖ పార్సిల్‌ టెర్మినల్‌గా అభివృద్ధి చేయడానికి దేశవ్యాప్తంగా 4 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసింది. అందులో కాచిగూడ(దక్షిణ మధ్య రైల్వే), సంగోల(మధ్య రైల్వే), కోయంబత్తూర్‌(దక్షిణ రైల్వే), కంకరియా(పశ్చిమ రైల్వే) ఉన్నాయి. కొత్త పార్సిల్‌ టెర్మినల్‌ అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం కాచిగూడ స్టేషన్లో సరకు లోడ్‌ చేసే సామర్థ్యాన్ని 3 నుంచి 5 బోగీలకు పెంచారు. రానున్న రోజుల్లో సామర్థ్యాన్ని 22 బోగీల వరకు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి.


శ్యామ్‌ కెనాయుడు, ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

ఈనాడు, దిల్లీ : సినీ నటి బి.శ్రీసుధ దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న సినిమాటోగ్రాఫర్‌ కామిరెడ్డి శ్యామ్‌ నాయుడు (శ్యామ్‌ కె.నాయుడు), తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పెళ్లి పేరుతో శ్యామ్‌ కె.నాయుడు తనను మోసగించారని శ్రీసుధ గతంలో అతనిపై కేసు పెట్టింది. వివాదం తెలంగాణ హైకోర్టుకు వెళ్లడంతో తమ మధ్య రాజీ కుదిరిందంటూ శ్యామ్‌ కె.నాయుడు కోర్టుకు పలు పత్రాలు సమర్పించారు. హైకోర్టు ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. నాయుడుకు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ శ్రీసుధ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను జస్టిస్‌ మోహన్‌ ఎం.శంతనుగౌడార్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గత నెలలో విచారించింది. ప్రతివాదులుగా ఉన్న శ్యామ్‌ కె.నాయుడు, తెలంగాణ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీని ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.


వాలీబాల్‌ రాష్ట్ర జట్ల ఎంపిక

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీల్లో ప్రతిభ చాటిన 24 మంది క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేసినట్లు సిద్దిపేట వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాల సాయిరాం, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేటలో బుధవారం వారు మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన ఉమ్మడి జిల్లాలకు చెందిన మహిళా, పురుష క్రీడాకారులను శిక్షణకు ఎంపిక చేశారు. రెండు జట్లు రాష్ట్రం తరఫున ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నాయి.

రాష్ట్ర జట్లకు ఇలా.. : పురుషుల విభాగంలో.. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి యశ్వంత్‌, మిరాజుద్దీన్‌, రంగారెడ్డి - కిషోర్‌రెడ్డి, హైదరాబాద్‌ - కృష్ణచైతన్య, సచిన్‌, వరంగల్‌ - ప్రశాంత్‌, బిక్షపతి, నిజామాబాద్‌ - రాకేశ్‌, కరీంనగర్‌ - శశికిరణ్‌, ఖమ్మం - పవన్‌తేజ్‌, మెదక్‌ - రాజశేఖర్‌, రాహుల్‌ గౌడ్‌ ఎంపికవగా శిక్షకుడిగా జమీల్‌, సహాయ శిక్షకులుగా సూరజ్‌సింగ్‌, ప్రవీణ్‌, మేనేజర్‌గా లక్ష్మీప్రసాద్‌ వ్యవహరించనున్నారు.

మహిళల విభాగంలో..: నల్గొండ జిల్లా నుంచి మానస, నిజామాబాద్‌ - ప్రియాంక, మెదక్‌ - దివ్య, హైదరాబాద్‌ - మేఘన, మంజు, బిస్మిన్‌ మాజిద్‌, అతిర శ్రీధరన్‌, శ్రేయ, శ్రుతి, నిజామాబాద్‌ - అఖిల, ఖమ్మం - భారతి, రంగారెడ్డి - సాహితీ ఎంపికవగా శిక్షకురాలిగా రమాదేవి, సహాయక శిక్షకులుగా అశోక్‌, కరుణారెడ్డి వ్యవహరించనున్నారు.


మూడోసారి.. వడ్డీ మాఫీ!

ఈనాడు, హైదరాబాద్‌: ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఓటీఎస్‌(వన్‌ టైమ్‌ అమ్నెస్టీ స్కీమ్‌) గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వు జారీ చేయడంతో జీహెచ్‌ఎంసీకి ఊరట లభించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితి నుంచి ఇది గట్టెక్కిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం చివర్లో అదనంగా మరో రూ.150 కోట్లు సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే చివరి అవకాశమని గుర్తుచేస్తున్నారు. పదేళ్లు, అంతకు ముందు నుంచి ఆస్తిపన్ను చెల్లించని మొండి బకాయిదారులకు ఓటీఎస్‌ వరంలాంటిది. ఈ పథకం గతేడాది ఆగస్టు 1న అమల్లోకి రాగా అక్టోబరు నెలాఖరు వరకు రూ.275 కోట్లు వసూలైంది. జలమండలి సైతం నల్లా బకాయిలకు ఉద్దేశించిన ఓటీఎస్‌ను పొడిగించాలని కోరింది. వీటిపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అనుమతితో మార్చి 31, 2021 వరకు గడువు పొడిగిస్తున్నట్లు బుధవారం ఆ శాఖ ప్రకటించింది.


సోదరి ప్రేమ వివాహం... సోదరుడి ఆత్మహత్య

షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: తన సోదరి ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్‌కుమార్‌ వివరాల ప్రకారం.. పట్టణంలోని తిరుమల కాలనీకి చెందిన మదనాల అంజయ్య కుమారుడు శీను(25) స్థానిక పరమేశ్వర థియేటర్‌ క్యాంటీన్‌లో పని చేస్తుండేవాడు. ఇతనికి ఓ చెల్లెలు ఉంది. ఆమె నెలరోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో సోదరుడు మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి థియేటర్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన శీను బుధవారం ఉదయం అక్కడి ఆవరణలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శీను తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


అంతర్జాతీయ కాల్స్‌ను పక్కదారి పట్టిస్తున్న ముగ్గురి అరెస్టు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అంతర్జాతీయ కాల్స్‌ను జాతీయ కాల్స్‌గా మారుస్తున్న ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌, సీఐ కనకయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. సులేమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ అశ్వక్‌(23) రాజేంద్రనగర్‌లోని డైరీఫాం సమీపంలో సెల్వా టెక్నాలజీని స్థాపించాడు. మహ్మద్‌ నజీర్‌(30), షేక్‌అక్బర్‌లను సహాయకులుగా నియమించుకున్నాడు. కొన్ని దేశాలలోని సంస్థలతో ఒప్పందం చేసుకుని అక్కడి నుంచి వస్తున్న అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌ కాల్స్‌గా మారుస్తున్నాడు. విదేశాల నుంచి ఫోన్‌ చేస్తున్నా స్థానిక నంబర్‌ నుంచి వస్తుండటంతో కొందరు ఆశ్చర్యపోయారు. ఈ మోసాన్ని పసిగట్టిన టెలీకాంసంస్థ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని బుధవారం రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు నిందితులు కాల్స్‌ను మళ్లిస్తున్న తీరుతో దేశభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, టెలికాం సంస్థకు సైతం ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని ఏసీపీ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల నిఘా సంస్థలకు ఫోన్ల విషయం అంతుచిక్కకుండా ఉండే అవకాశం ఉందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని