
సినీ ఫక్కీలో మోసం!
వాహనం తగిలిందంటూ బెదిరించి డబ్బు వసూలు
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: కారు తగలకున్నా తగిలిందంటూ వెంటాడి కొట్టి డబ్బులు వసూలు చేయడం సినీ ఫక్కీలో జరిగింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. సఫిల్‌గూడ ప్రాంతానికి చెందిన గన్నవరం వంశీ కిషోర్ (40) గచ్చిబౌలి టీ-హబ్ సమీపంలోని ఆల్ట్రా కన్సల్టింగ్ లిమిటెడ్‌లో ఉద్యోగి. మంగళవారం ఉదయం ఆయన తన కారులో కార్యాలయానికి వెళుతుండగా 9.40 గంటల ప్రాంతంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ సమీపంలో ఓ ఆటోవాలా కారు ముందుకొచ్చి ఆటోను అడ్డుపెట్టాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ వాహనదారుడు, ఆటోవాలా గొడవపడ్డారు. ట్రాఫిక్ ఆగడంతో ఇతర వాహనదారులు మందలించారు. వంశీకిషోర్ బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లో వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన సదరు ఆటోవాలా కారును ఆపాడు. బైకుపై వచ్చిన ఇద్దరు వంశీకిషోర్ను కొట్టారు. అందులో ఒకరు.. తమ కుటుంబ సభ్యులను ప్యారడైజ్ ఫ్లైఓవర్ వద్ద ఢీకొట్టావని అంటే మరొకరు బేగంపేట ఫ్లైఓవర్ వద్ద ఢీకొట్టి వచ్చావన్నారు. బెదిరించి రూ.8 వేలు లాక్కుని పారిపోయారు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.