
చలానా కట్టకుంటే జప్తు
ఈనాడు, హైదరాబాద్: మీ వాహనంపై ట్రాఫిక్ చలానాలు పెండింగ్‌లో ఉన్నాయా? అయితే వెంటనే కట్టేయండి. లేదంటే మీ బండి ఎక్కడ కనిపిస్తే అక్కడే సైబరాబాద్ పోలీసులు సీజ్ చేస్తారు. గతేడాది రూ.148 కోట్లు పెండింగ్‌లో ఉండటంతో ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయి సిబ్బంది తనిఖీలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలు, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల నుంచి అందే ఫిర్యాదుల ఆధారంగా ఉల్లంఘనులను గుర్తించి జరిమానా విధిస్తున్నారు. సైబరాబాద్‌లో గతేడాది 47.83 లక్షలకుగాను 45.07 లక్షల ఉల్లంఘనలను సీసీ కెమెరాల ద్వారానే గుర్తించడం గమనార్హం. 2019తో పోలిస్తే గతేడాది 21 లక్షల చలానాలను అధికంగా విధించారు. అయితే వాహనదారులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. గతేడాది రూ.178.35 కోట్లకు రూ.30.32 కోట్లు మాత్రమే చెల్లించారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు మొదట్లో ప్రధాన కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒకటి, రెండు కంటే ఎక్కువగా చలానాలుంటే దగ్గర్లో ఉన్న మీ-సేవా కేంద్రం లేదా ఆన్లైన్లో కట్టించారు. ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రోజు వందలాది మంది వాహనదారుల (ఎక్కువగా చలానాలున్న వారికి)కు ఫోన్లు చేశారు. ప్రధాన ప్రాంతాల్లోని పార్కింగ్ స్థలాలపై నజర్ పెట్టారు. ఎక్కువ చలాన్లున్న వాహనాలను గుర్తించి ప్రత్యేక స్టిక్కర్ అతికించారు. దానిపై ఎన్ని చలాన్లు.. ఎంత మొత్తం పెండింగ్‌లో ఉందనే వివరాలు రాసి అప్రమత్తం చేశారు.
చెల్లించినట్లు రశీదు చూపిస్తేనే వాహనం..
ట్రాఫిక్ సిబ్బంది దగ్గరుండే ట్యాబ్‌లో వాహనం నంబర్‌ను నమోదు చేయగానే చలానాల వివరాలు కనిపిస్తాయి. ఎక్కువ చలానాలు చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉంటే మాత్రం అక్కడికక్కడే సీజ్ చేసి దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. చెల్లించినట్టు రశీదు చూపించిన తర్వాతనే వాహనాన్ని తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.