Updated : 04/03/2021 08:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేధిస్తే ఉద్యోగం ఊడుతుంది!

పనిచేస్తున్న ప్రదేశాల్లో యువతులు, మహిళలను వేధింపులకు గురిచేస్తే హైదరాబాద్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వేధించినట్లు రుజువైతే ఉద్యోగం ఊడుతుందని హెచ్చరిస్తున్నారు. పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందన్న భావనతో చాలామంది బాధితులు మౌనంగా వేధింపులను భరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. పనిచేస్తున్న ప్రదేశాల్లో యువతులు, మహిళలను రక్షించేందుకు కేంద్రం 2013లో చేసిన చట్టం(పోష్‌-2013)పై విస్తృత ప్రచారం చేస్తున్నారు. సీపీలు, ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం, భరోసా కేంద్రాలతోపాటు ప్రతి ఠాణాలోనూ ప్రకటనలు అతికించారు. బాధితులు సంప్రదించాల్సిన అధికారులు, వారి ఫోన్‌ నంబర్లను ఆ ప్రకటనల్లో ముద్రించారు.

చొరవ తీసుకున్నా.. ద్వంద్వార్థాలతో మాట్లాడినా..

మహిళలు, యువతులతో సహద్యోగులు, అధికారులు ద్వంద్వార్థాలతో మాట్లాడినా.. మితిమీరిన చొరవ ప్రదర్శించినా నేరమే. అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడంటూ బలవంతం చేసినా బాధితులు ఫిర్యాదు చేయొచ్ఛు తమ బాధను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అంతర్గత కమిటీలకు లిఖిత పూర్వకంగా తెలిపినా నిందితులపై చర్యలు తీసుకుంటారు. తీవ్రత ఆధారంగా ఉద్యోగం నుంచి తొలగించొచ్ఛు

భరించకండి.. ముందుకు రండి

కార్యాలయాల్లో మహిళలు లైంగిక వేధింపులు.. అవమానాలను భరించవద్దని పోలీసులు అంటున్నారు. ఫిర్యాదు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. బాధితుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయబోమని చెబుతున్నారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని