Published : 04/03/2021 03:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మెట్రో వచ్చినా.. జేబీఎస్‌ దూరమే!

నగరంలోని ప్రధాన ప్రయాణ ప్రాంగణాల్లో ఒకటైన జూబ్లీ బస్‌స్టేషన్‌కు అనుసంధానం కరవైంది. మేడ్చల్‌, బోయిన్‌పల్లి, కంటోన్మెంట్‌ ప్రాంతాలు మినహా ఎక్కడి నుంచి వచ్చినా జేబీఎస్‌కు చేరాలంటే కిలోమీటరు దూరం నడవాలి. లేదా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాలి. మెట్రో వస్తే ఇబ్బందులు తొలుగుతాయని భావించినా.. మార్పులేదు. మెట్రో దిగిన తర్వాత కంటోన్మెంట్‌ డిపో ముందు నుంచి అర కి.మీ. పైనే నడవాలి. ఈ మార్గంలో విపరీతంగా దుమ్ము లేస్తోంది.

వెయ్యి సర్వీసుల లోపే...

తెలంగాణలోని అన్ని జిల్లాలకు.. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, వరంగల్‌, నల్గొండలకు ఇక్కడ నుంచే బస్సులు వెళ్తాయి. కరోనాకు ముందు 1150 వరకూ సర్వీసులు ఉండగా, 50 నుంచి 60 వేల మంది నిత్యం ప్రయాణిస్తుండేవారు. ప్రస్తుతం బస్సుల సంఖ్య వెయ్యిలోపునకు, ప్రయాణికులూ 50 వేల లోపే ఉంటోంది. ఇక్కడి నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు సిటీ బస్సులు లభించవు. కొన్ని ప్రాంతాలకు ప్యాట్నీ వరకు నడుచుకుంటూ వెళ్లి బస్సులెక్కాలి. జేబీఎస్‌కు రావాలన్నా.. అక్కడే బస్సు దిగి రావాలి.

దుమ్ము లేస్తున్నా పట్టదు

ప్యాట్నీలో దిగి కంటోన్మెంట్‌ డిపో ముందు నుంచి జేబీఎస్‌కు వచ్చేందుకు ఉన్న మార్గంలో గుడిసెలను తొలగించి దారి ఏర్పాటు చేసి అయిదేళ్లవుతోంది. కాని ఇప్పటికీ అది మట్టి రోడ్ఢే బస్సులు వెళ్తున్నప్పుడు భారీగా దుమ్ము లేస్తోంది. దీనికి తోడు గుంతల రోడ్డు కావడంతో.. అటుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. ఇక్కడ తారు లేదా సిమెంటు రోడ్డు వేస్తే ప్రయాణికులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. మరోవైపు కనీసం డిపో ముందు రహదారి వేయలేని దుస్థితిలో ఆర్టీసీ యంత్రాంగం ఉండడం గమనార్హం.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని