Updated : 04/03/2021 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హత్య చేసి ఆభరణాలు చోరీ

మహిళతో కలిసి పాత నేరస్థుడి ఘాతుకాలు

తెలుగు రాష్ట్రాల్లో 12 కేసులు నమోదు


నిందితులు వెంకటేశ్వర్‌రావు, నాగలక్ష్మి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ఇంటిని అద్దెకు ఇచ్చిన మహిళను దారుణంగా హత్య చేసి ఆభరణాలు దోచుకుని పరారైన జంటను షాద్‌నగర్‌ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మూడు నెలల క్రితం ఫరూక్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి రాంనగర్‌ కాలనీలో మహిళ హత్య మిస్టరీని ఛేదించారు. రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తప్పించుకోవడానికి యత్నించిన వైనంపై ఎస్సై వెంకటేశ్వర్లు సీసీ ఫుటేజీ ప్రదర్శించారు. శంషాబాద్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో బుధవారం డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, బిగుగొండకు చెందిన గుంజి వెంకటేశ్వర్‌రావు(33) వివాహితుడు. మేస్త్రీ పనులు చేసేవాడు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం ఇప్పరపల్లికి చెందిన వివాహిత సానుగొమ్ముల నాగలక్ష్మి(30)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఉపాధి కోసం ఇద్దరూ చిత్తూరు వెళ్లారు. గత నవంబరులో ఫరూక్‌నగర్‌కు వచ్చి చటాన్‌పల్లిలో అద్దెకు ఉంటున్నారు. అప్పటికే చోరీలకు పాల్పడి జైలుకెళ్లి వచ్చిన వెంకటేశ్వర్‌రావు.. నవంబరు 22న ఇంట్లో ఒంటరిగా ఉన్న యజమాని మంగలి సువర్ణ(45)కు కల్లులో నిద్రమాత్రలు వేసి తాగించారు. స్పృహ తప్పిన ఆమెను ఇద్దరూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. బంగారు ఆభరణాలను తీసుకుని ఆధారాలు దొరక్కుండా మిరప పొడి చల్లి ఇంటికి తాళం వేసి గుంటూరు వెళ్లిపోయారు. సూర్యాపేటలో బంగారు ఆభరణాలను ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కుదువ పెట్టి రూ.లక్ష తీసుకుని బెంగళూర్‌కు వెళ్లారు. డబ్బు అయిపోవడంతో ఘట్‌కేసర్‌కు భార్యాభర్తల్లా వచ్చి అద్దె ఇంటిని తీసుకున్నారు. ఇంటి యజమానులతో నమ్మకంగా ఉంటూ గత నెల 18న వారు వండిన కూరల్లో నిద్రమాత్రలు వేశారు. స్పృహ తప్పిన తర్వాత ఆభరణాలతో ఉడాయించారు. షాద్‌నగర్‌లో మాదే సాయన్న వద్ద కుదవ పెట్టిన బంగారం తీసుకోవడానికి వచ్చారు. అప్పటికే నిఘా పెట్టిన షాద్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఇద్దరి చోరీల చిట్టా బయట పడింది. తెలుగు రాష్ట్రాల్లో 12 కేసులు నమోదైనట్లు గుర్తించారు. సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరు విధిగా ఏర్పాటు చేసుకోవాలని.. అద్దెకు వచ్చిన వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని