
ఆట ముగిసింది.. యాప్ మాయమైంది
సైబర్ ఠాణాలో 50 మంది ఫిర్యాదు
నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ‘న్యూ వర్క్’ యాప్‌లో పెట్టుబడి పెడితే రూ.లక్షలు సంపాదించొచ్చు’ ప్రకటనకు ఆకర్షితులమై పెద్ద మొత్తంలో మోసపోయామని బుధవారం 50 మంది బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసుల వివరాల ప్రకారం.. ‘న్యూ వర్క్’ యాప్ ప్లేస్టోర్‌లో ఉండదు. సభ్యులుగా చేరిన వారికి నిర్వాహకులు ఓ లింక్ పంపిస్తారు. దానిపై క్లిక్ చేస్తే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. నగరానికి చెందిన కొందరు రూ.1000 పెట్టి ఇందులో సభ్యులుగా చేరారు. వారితో నిర్వాహకుడు ఓ వాట్సాప్ గ్రూప్ తయారు చేసి, లింక్ రూపంలో రోజుకో టాస్క్ ఇస్తాడు. క్లిక్ చేయగానే వీడియో ప్రత్యక్షమవుతుంది. లైక్ చేసి, ఫాలోపై క్లిక్ చేయాలి. అనంతరం వీడియోను స్క్రీన్‌షాట్ తీసి న్యూవర్క్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. రూ.1000 కడితే రోజుకి 25 స్క్రీన్ షాట్లు, రూ.2 వేలు కడితే 50 స్క్రీన్షార్ట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని 45 నిమిషాల్లో పూర్తి చేయాలి. సభ్యులుగా ఉన్నవారు కొత్తగా ఎవరినైనా చేర్పిస్తే ఒక్కో సభ్యుడిపై రూ.15 చొప్పున అదనంగా వస్తాయి. రూ.3 వేలు పెట్టుబడి పెడితే వచ్చే 55 టాస్క్‌లతో రోజు రూ.1,350 సంపాదించవచ్చని యాప్ నిర్వాహకులు పేర్కొనడమే కాకుండా సభ్యులకు సందేశాలు పంపిస్తారు. ఇలా చాలా మంది సభ్యులుగా చేరగా, రమ్మి క్లబ్ యాప్ ద్వారా డబ్బులు జమయ్యాయి. కొందరు రూ.లక్ష అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టారు. అంతే.. వాట్సాప్‌లో లింక్‌లు ఆగిపోయాయని, బాధితులు పోలీసులకు చెప్పారు. ఇది మల్టీలెవల్ వ్యాపారమని, సైబర్ పరిధిలోకి రాదని మొదట సీసీఎస్ పోలీసుల వద్దకు పంపగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సైబర్ పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.