Updated : 04/03/2021 06:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పు డబ్బులు అడిగినందుకు అంతమొందించాడు

రాస్నంలో మహిళ హత్య


బేగరి లక్ష్మి

తాండూరు, యాలాల, న్యూస్‌టుడే: అప్పు ఇచ్చిన డబ్బుల కోసం వెళ్లిన మహిళ ఒకరు హత్యకు గురైన సంఘటన యాలాల మండలం రాస్నం అటవీప్రాంతంలో జరిగింది. తాండూరు గ్రామీణ సీఐ జలంధర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. యాలాల మండలం పగిడ్యాలకు చెందిన బేగరి లక్ష్మి(31)కి తాండూరు పట్టణం పాత తాండూరుకు చెందిన బాలప్పతో పదిహేనేళ్ల కిందట వివాహం అయింది. తొమ్మిదేళ్ల కిందట మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అప్పటి నుంచి లక్ష్మి తల్లి గారి ఇంటి వద్దే ఉంటోంది. పెద్దేముల్‌ మండలం బండమీదిపల్లికి చెందిన మాల నర్సింహులుతో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ చనువుతోనే లక్ష్మి తనవద్ద ఉన్న రూ.40 వేలను నర్సింహులుకు అప్పుగా ఇచ్చింది. వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో చెల్లించాలని చాలా సార్లు అతన్ని అడిగింది. ఫిబ్రవరి 25న డబ్బులు ఇస్తానని ఆమెను రాస్నంలోని బ్యాంకు వద్దకు రప్పించి ఖాతా తెరిపించాడు. త్వరలోనే డబ్బులు జమచేస్తానని నమ్మించాడు. ఇద్దరూ కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న అడవికి వెళ్లి అక్కడే మద్యం తాగారు. అనంతరం నర్సింహులు కత్తితో అకస్మాత్తుగా లక్ష్మిపై దాడిచేసి గాయపరిచాడు. కింద పడిపోగానే గొంతు నులిమి హత్యచేసి తన గ్రామానికి చేరుకున్నాడు. ఇంటి నుంచి వెళ్లిన లక్ష్మి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లి పద్మమ్మ అదే నెల 28న యాలాల ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసుగా నమోదు చేసని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మితో సన్నిహితంగా ఉండే నర్సింహులుపై అనుమానంతో రెండురోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా అటవీ ప్రాంతాన్ని బుధవారం పరిశీలిస్తే అస్థిపంజరంగా బయటపడింది. సంఘటనా స్థలంలో చీర ఆధారంగా కుటుంబ సభ్యులు లక్ష్మిగా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నిందితుడుని అదుపులోకి తీసుకున్నామని గురువారం రిమాండుకు తరలిస్తామని సీఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని