Published : 04/03/2021 03:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సమృద్ధిగా నిధి.. వినియోగించడం విధి

1,236 పనులకు రూ.50 కోట్లు

ఇప్పటి వరకు 773 పూర్తి

 

సిమెంటు దారి నిర్మాణం

* వికారాబాద్‌ నియోజకవర్గంలోని కోట్‌పల్లి మండలానికి ఈ ఏడాది జిల్లా పరిషత్‌ నుంచి 162 పనులకు రూ.6.43 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు కేవలం 73 పనులు పూర్తయ్యాయి. రూ.1.89 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

* తాండూరు, యాలాల మండలాల్లోనూ పనుల పురోగతి తక్కువగా ఉంది. తాండూరుకు రూ.4.91 కోట్లు మంజూరైతే రూ.1.37 కోట్లు ఖర్చు చేశారు. యాలాలకు రూ.6.07 కోట్లకు రూ.1.66 కోట్ల పనులు మాత్రమే ఖర్చయ్యాయి. కొన్ని పనులు పురోగతిలో ఉన్నా.. మరికొన్ని ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.

న్యూస్‌టుడే, బషీరాబాద్‌, పాత తాండూరు: గ్రామాల అభ్యున్నతికి జిల్లా పరిషత్‌ నుంచి అత్యధికంగా నిధులు మంజూరవుతున్నాయి. వీటి వినియోగంలో నిర్లక్ష్యం వెంటాడుతోంది. సమృద్ధిగా నిధులున్నాయి.. పనులు వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నా, కిందస్థాయి నాయకులు దాటవేస్తున్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల రోజులు వ్యవధి కూడా లేదు. అంతలోపు పనులు పూర్తి చేయించాలని ఆయా మండలాల పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు వివరిస్తున్నారు.

ఖర్చు చేయాల్సింది రూ.30.29 కోట్లు: జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో సిమెంటు దారులు, మురుగు కాల్వల నిర్మాణంతోపాటు పొలాలకు వెళ్లేందుకు పానాదుల దారుల మరమ్మతులు, మట్టి దారుల నిర్మాణం తదితర 1,236 పనులకు జిల్లా పరిషత్‌ సాధారణ నిధులు రూ.50.01 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 773 పనులు పూర్తి చేయడంతో రూ.19.79 కోట్లు ఖర్చు అయ్యాయి. 218 పనులు పరోగతిలో ఉండగా.. 246 ఇంకా ప్రారంభించాల్సి ఉందని పంచాయతీరాజ్‌ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న 464 పనులను పూర్తి చేసి రూ.30.29 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఇసుక ఇబ్బందులు ఉన్నాయని, స్థానికంగా ఉన్న నదులు, వాగుల నుంచి ఇసుకకు అనుమతులు ఇస్తే పనులు పూర్తవుతాయని గ్రామ నాయకులు పేర్కొంటున్నారు. కంకర మిశ్రమం (డస్ట్‌)తో పనులు చేస్తే నాణ్యతగా ఉండడం లేదని వివరిస్తున్నారు. ఇసుక ఇబ్బందుల వల్లే పనులు సకాలంలో కావడం లేదని పేర్కొంటున్నారు.

తాండూరులో ఎక్కువ.. కొడంగల్‌లో తక్కువ..: తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గానికి అధికంగా జిల్లా పరిషత సాధారణ నిధులు మంజూరు కాగా, కొడంగల్‌ నియోజకవర్గానికి తక్కువ నిధులు మంజూరయ్యాయి. దౌల్తాబాద్‌, కొడంగల్‌, బొంరాస్‌పేటకు కలిపి 23 పనులకు కేవల రూ.1.01 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో అత్యధికంగా కర్నాటక సరిహద్దులో ఉన్న బషీరాబాద్‌ మండలానికి రూ.8.33 కోట్లు మంజూరయ్యాయి.

వెంటనే పూర్తి చేయిస్తాం: డీఈఈ, పంచాయతీరాజ్‌, తాండూరు

జిల్లా పరిషత్‌ నుంచి మజూరైన పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయిస్తాం. ప్రారంభం కాని వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఎక్కువ శాతం పనులు పూర్తయ్యాయి. కొన్ని మాత్రమే పురోగతిలో ఉన్నాయి.. వాటన్నింటినీ నెలాఖరులోగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటాం.

పనులు చేయకపోతే నిధులు మళ్లిస్తాం : - సునీతారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు

అభివృద్ధి పనులకు ఇచ్చిన నిధులను సకాలంలో పూర్తి చేయకపోతే వాటిని రద్దు చేసి ఇతర పనులకు మళ్లిస్తాం. మారుమూల మండలాల అభివృద్ధికి జిల్లా పరిషత్‌ నుంచి రూ.50 కోట్ల వరకు నిధులిచ్చాం. వాటిని వినియోగించి ప్రజాసమస్యలను పరిష్కరించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని