Published : 04/03/2021 03:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం: మంత్రి హరీశ్‌రావు


సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో అభ్యర్థి వాణీదేవి, మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

న్యూస్‌టుడే, తాండూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించాల్సిందేనని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తాండూరులో బుధవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణమండపంలో ప్రైవేటు టీచర్లు, ఆర్‌ఎంపీలు, న్యాయవాదులు, ప్రైవేటు అధ్యాపకులతో పాటు, పట్టభద్రుల ఓటర్ల ఇన్‌ఛార్జులకు వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ భాజపా నుంచి పోటీ చేస్తున్న రామచంద్రరావుకు ఎమ్మెల్సీ పదవి ఇష్టం లేదని, గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. ఒకవేళ ఆరెండు స్థానాల్లో ఏ ఒక్క దాంట్లో విజయం సాధించినా రాజీనామా చేసేవారని పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్న ఆయనను ఓడించి హ్యాట్రిక్‌ ఓటమితో పంపించాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు, డీజీలు ధరలు సెస్సు రూపంలో కేంద్రం ధరలను పెంచేసిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో తెదేపా పోటీయే కాదు.. ఇక కాంగ్రెస్‌ దిల్లీలో లేదు గల్లీలో లేదని ఎద్దేవా చేశారు. తెరాస గెలిస్తే తాండూరు, వికారాబాద్‌కు కృష్ణానది జలాలు వస్తాయని చెప్పారు. తెరాస అభ్యర్థిగా పోటీలో ఉన్న సురభి వాణీదేవిని గెలిపించాలని కోరారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఒకటి రెండు ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో వాపు చూసి ఆ పార్టీ నాయకులు బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. తెరాస నుంచి వాణిదేవి పేరును ప్రకటించగానే దడపుట్టుకుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, రాష్ట్ర విద్యా,మౌలిక వసతుల ఛైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వప్న మాట్లాడారు.

ప్రతి ఓటూ కీలకమే

ప్రతి పట్టభద్రుడి ఓటు కీలకమని మంత్రి అన్నారు. 6,137 మంది ఓటర్లలో ప్రతి ఒక్కరిని ఇన్‌ఛార్జీలు రోజుకు మూడు సార్లు పలకరించాలని సూచించారు. భాజపాకు ఓటెందుకు వేయొద్దు, తెరాసకు ఎందుకు వేయాలనే విషయాన్ని స్పష్టంగా సూచించాలని వివరించారు. ఇన్‌ఛార్జులు తమ పరిధిలోని ఓటర్లతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించి పట్టభద్రుల నుంచి ఓట్లు రాబట్టాలని సూచించారు. నాగేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో తెరాస నాయకులు ఎవరు మంచిగా పనిచేస్తున్నారు? పనిచేసినట్లు ఎవరు నటిస్తున్నారనే వివరాలను అదిష్ఠానానికి నివేదిక పంపిస్తానని చెప్పారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, ఆర్‌ఎంపీలు, పీఎంపీలు, ప్రైవేటు అధ్యాపకులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, మౌలిక వసతుల ఛైర్మన్‌ పర్యాద కృష్ణమూర్తి, తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ ఛైర్‌పర్సన్‌ దీప పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని