Published : 04/03/2021 03:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భగీరథపైనే భరోసా

తాగునీటి బాధ్యత పంచాయతీలదే

వేసవి కార్యాచరణ శూన్యం

 

పరిగి మండలం రాఘవాపూర్‌ వద్ద నీటి శుద్ధి ప్లాంటు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: వేసవి వచ్చిందంటే తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రహదారులపై రాస్తారోకోలు చేసి నిరసనలు వెల్లువెత్తేవి. ఇప్పుడు ఆ పరిస్థితి తొలగిపోయింది. ప్రభుత్వం ‘మిషన్‌ భగీరథ’తో తాగునీటి అవస్థలను దూరం చేసింది. ఎక్కడైనా సాంకేతిక సమస్య వచ్చి, సరఫరా ఆగిపోతేనే నీళ్లు అందవు. ఈ ఎండాకాలంలో ఎద్దడిని అధిగమించే అంశంపై చర్చించిన జిల్లా అధికారులు పంచాయతీలపైనే భారం మోపారు. ఏ గ్రామానికి ఆ గ్రామం చర్యలు తీసుకోవాలని, మరీ అత్యవసరమైతే పక్క పల్లె నుంచి నుంచి తెచ్చుకోవాలని స్పష్టం చేశారు.

జిల్లాలో 566 పంచాయతీలు, నాలుగు పురపాలక సంఘాలు ఉన్నాయి. దాదాపుగా 9.20 లక్షల మంది జనాభా ఉంటారని అంచనా. ఒకొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ లెక్కన జిల్లాకు 9.20 కోట్ల లీటర్ల నీళ్లు అవసరం ఉంటుంది. పరిగి మండలం నుంచి భగీరథ ద్వారా జిల్లా అంతటా సరఫరా చేస్తున్నారు. 869 గ్రామాల్లో ట్యాంకులు నిర్మించాలని గ్రామీణ తాగునీటి విభాగం గుర్తించింది. ఇందులో ఇప్పటి వరకు 844 పనులు పూర్తికాగా, మరో 25 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఇటీవల కలెక్టర్‌ పౌసుమి బసు పంచాయతీరాజ్‌, తాగునీటి విభాగం అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య వచ్చినపుడు పక్కనే ఉన్న పంచాయతీల నుంచి ట్యాంకర్లు సాయంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2016-17లో వేసవి కార్యాచరణ ప్రణాళికలకు రూ.4.67 కోట్లు ఖర్చు చేయగా, 2017-18లో రూ.3.37 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. గతేడాది కరోనా కారణంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. అంతకు ముందు మిషన్‌ భగీరథ నుంచి గ్రామాల్లోని ప్రధాన ట్యాంకులకు సరఫరా చేసేవారు. పట్టణ ప్రాంతాల్లో పురపాలక సంఘాలకు చెందిన ట్యాంకర్లతో సరఫరా చేసేవారు.

మండలాలు: 18

పంచాయతీలు: 566

ఆవాస గ్రామాలు: 974

నిర్మించాల్సిన ట్యాంకులు: 869

పనులు పూర్తయినవి: 844

ప్రగతిలో ఉన్నవి: 25

ఏర్పాటు చేసిన పైపులైన్‌: 1,908 కిలోమీటర్లు

నల్లా కనెక్షన్లు ఉన్న నివాస గృహాలు: 1,97,592

ట్యాంకులకు జియోట్యాగ్‌

తాగునీటి ట్యాంకులన్నింటిని జియోట్యాగ్‌ చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎక్కడైనా సమస్య వచ్చినపుడు సమీపంలో ఏ ట్యాంకు ఉంది. అక్కడి నుంచి ఇబ్బందులు ఎదురైన గ్రామానికి ఎంతదూరం, ఆయా పంచాయతీలో ఎంత మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వారి అవసరాలకు ఎంత నీరు అవసరం. దానికి ఎన్ని ట్రాక్టర్‌, ట్యాంకర్లు పంపించాలి అనేది స్పష్టంగా తెలుసుకునేందుకు జియోట్యాగింగ్‌ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

ట్యాంకర్లతో సరఫరాకు

ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీ తప్పనిసరని వాటిని కొనుగోలు చేయించింది. ప్రస్తుతం వాటిని చెత్త తరలించడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటి పనులకు వినియోగిస్తున్నారు. అవసరమైతే ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

ఇబ్బంది రాకుండా చూస్తాం

జిల్లాలోని పంచాయతీలకు భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేదు. వేసవిలో ఏదైనా సమస్య తలెత్తితే ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పంచాయతీల పరిధిలోని ట్యాంకర్లను వినియోగించుకోనున్నాం. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తాం.

- బాబుశ్రీనివాస్‌, జిల్లా గ్రామీణ తాగునీటి విభాగం ఈఈ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని