
తొలగిన అంధకారం
పరిగి: పట్టణంలో జాతీయ రహదారిపై వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ‘చిమ్మ చీకట్లు..ప్రయాణానికి ఇక్కట్లు’ అనే శీర్షికతో బుధవారం ఈనాడులో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. మీటర్లు లేకుండా నేరుగా విద్యుత్తు వినియోగిస్తుండటంతో ట్రాన్స్‌కో అధికారులు సరఫరా నిలిపివేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరికొద్ది రోజులు గడువు ఇస్తూ పంపిణీ పునరుద్ధరిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ ఖాజాబాబు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.
పూడూరులో జోరుగా ధరణి రిజిస్ట్రేషన్లు
పూడూరు, న్యూస్‌టుడే: పూడూరు తహసీల్దారు కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. మండల కేంద్రాల్లో ధరణి ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి మొదట్లో రోజుకు 10 నుంచి 15 వరకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. రెండు వారాల నుంచి రెట్టింపుగా నిత్యం సుమారు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నట్లు తహసీల్దారు కిరణ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఒకరోజు ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న వారికి నమోదు ప్రక్రియ పూర్తికాగానే మ్యుటేషన్, పట్టాదారు పాసుపుస్తకం నకలు అందిస్తున్నట్లు చెప్పారు.
ప్రకృతి వ్యవసాయమే మార్గం
ధారూర్: వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలంటే ప్రకృతి సేద్యమే మార్గమని సేవ్ సంస్థ నిర్వాహకులు విజయ్‌రామ్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని బురుగడ్డలో సుభాష్ పాలేకర్ వ్యవసాయ క్షేత్రంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవాలి విత్తనంతో పంటలు పండించాలన్నారు. వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిలా,్ల మండల వ్యవసాయాధికారులు గోపాల్, ఎం.జ్యోతి, గాయని విమలక్క, సర్పంచి చంద్రమౌళి, విస్తరణాధికారులు పాల్గొన్నారు.