Updated : 05/03/2021 05:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రేగడి నేలల్లో.. తీపి ఒరవడి

బుద్దారంలో సాగవుతున్న చెరకు పంట

న్యూస్‌టుడే, పెద్దేముల్‌: జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి చెరకు పంట ఆరువేల ఎకరాల్లో సాగవుతోంది. ఇందులో పెద్దేముల్‌, బంట్వారం మండలాల్లోనే నాలుగు వేల ఎకరాల్లో పండిస్తున్నారు. గతంతో పోల్చితే సాగు విస్తీర్ణం 4500 ఎకరాలకు పెరిగింది. చెరకు ఒకసారి పెట్టుబడి పెడితే మూడేళ్ల వరకు పంటను సాగు చేయవచ్ఛు మొదటి ఏడాది ఎకరాకు సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల చొప్పున ఖర్చు వస్తోంది. అనంతరం రెండేళ్లు పెట్టుబడులు ఉండవు. ఎరువులు చల్లు కోవడం, నీటి తడులు పెట్టడం వంటివి చేయాల్సి ఉంటుంది. పంటను సాగు చేస్తున్న వారు ముందుగా సంగారెడ్డిలోని చక్కెర పరిశ్రమతో ఒప్పందం చేసుకోవడంతో ఎరువులు, మందులను రాయితీపై వారే అందిస్తున్నారు. ఆసక్తితో ముందుకు వచ్చిన వారికి విత్తన చెరకును అందించి ప్రోత్సహిస్తున్నారు. కోతల సమయంలో యంత్రాలను, కూలీలను సమకూరుస్తున్నారు. నిర్ణయించిన ధరకే పంటను కొనుగోలు చేయడంతో ఇబ్బందులు ఎదురవ్వవు. పెట్టుబడి ఖర్చులను మినహాయించి డబ్బులను నేరుగా రైతు ఖాతాల్లోనే జమచేయనున్నారు.

రూ.58 కోట్ల లావాదేవీలు: రైతులు, చక్కెర పరిశ్రమ మధ్యన ఈ ఏడాది సుమారు రూ.58 కోట్ల లావాదేవీలు జరుగనున్నాయి. ప్రస్తుతం టన్నుకు రూ.3,250 చొప్పున చెల్లిస్తున్నారు. ఆరువేల ఎకరాల్లో ఎకరాకు సగటున 30 టన్నుల చెరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రవాణా, కూలీలు, ఇతర ఖర్చులు పోను టన్నుకు రూ.2,280 చొప్పున చెల్లిస్తున్నారు. అన్ని అనుకూలిస్తే రైతులకు రూ.41 కోట్ల ఆదాయం సమకూరనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు నిర్బంధ సాగు వ్యవసాయం చేశారు. ఈ విధానంలో పత్తి, వరి, కంది పంటలను సాగు చేశారు. అధిక వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పత్తి ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సన్న రకం వరిని సాగు చేసిన రైతులు మద్దతు ధర రాక తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రస్తుతం మంచి ఆదాయం వచ్చే చెరకు పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.


మంచి లాభాలు వస్తున్నాయి - జితేందరర్‌రెడ్డి, రైతు, పెద్దేముల్‌

30 ఏళ్లుగా చెరకు సాగు చేస్తున్నాను. ఎప్పుడు నష్టం రాలేదు. ఈ ఎడాది 8 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. పంట మార్పిడి చేస్తూ లాభాలు అర్జిస్తున్నాం. ఇతర పంటలు వేసి అధిక వర్షాల వల్ల నష్టం జరిగింది.


అయిదెకరాల్లో... - ఆనందం, రైతు, బుద్దారం

చెరకు సాగుతోనే ఈ ప్రాంత రైతులకు వ్యవసాయంపై భరోసా కలుగుతోంది. ఏ పంట వేసినా పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోయింది. చెరకు మాత్రం లాభాలను కలిగిస్తోంది. ఐదు ఎకరాల్లో పదేళ్లుగా ఇదే పంటను సాగు చేస్తున్నాను. ఏటా ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల ఆదాయం వస్తోంది.


పెరిగిన చెరకు సాగు విస్తీర్ణం

గ్రామాల వారీగా

* పెద్దేముల్‌ మండలం అడ్కిచర్ల, పాషాపూరు, తట్టేపల్లి, ఓమ్లానాయక్‌ తండా, బండమీదిపల్లి, పెద్దేముల్‌, బుద్దారం, గాజీపూరు, కందనెల్లి, మంబాపూరు, ఖానాపూరు, గోపాల్‌పూరు, తింసాన్‌పల్లి.

* బంట్వారం మండలం తొర్మామిడి, బోపునారం, బస్వపూరు, బంట్వారం, రొంపల్లి.

* కోట్‌పల్లి మండలం జిన్నారం, మదన్‌పల్లి.

* ఆయా గ్రామాల్లో ఎర్ర, నల్ల రేగడి నేలలు ఉండటంతో ఆసక్తి చూపుతున్నారు.

* పంట కొనుగోలుకు పక్కనే పరిశ్రమ ఉండటం వల్ల రైతులకు ఇబ్బందుల కలగడం లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని