Published : 05/03/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజా సంక్షేమానికి పెద్దపీట: మంత్రి వేముల

మాట్లాడుతున్న ప్రశాంత్‌ రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్‌ పట్టణం: తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్‌ చెరగని ముద్ర వేసుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. మూడేళ్లలో లక్ష 36 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌, భాజపా నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెరాస బలపరిచిన సురబి ఫవాణీ దేవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేసిపార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించేందుకు ప్రణాళికతో సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్‌ రాజేశ్వర్‌, ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ ఉషారాణి, కౌన్సిలర్‌ మధు యాదవ్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ శివకుమార్‌ గుప్తా పాల్గొన్నారు.


తెరాసతోనే మరింత అభివృద్ధి: రోహిత్‌రెడ్డి

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): తెరాస ఎమ్మెల్సీ అభర్థి వాణీ దేవిని గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన గురువారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఓ శిక్షణ కేంద్రంలో పట్టభద్రులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. తెరాస అభ్యర్థిని గెలిపిస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరించటానికి అవకాశాలు ఉంటాయన్నారు. భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థుల మాయమాటలు నమ్మవద్దన్నారు.


నాణ్యతలో రాజీపడొద్దు

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: శంకర్‌పల్లి పురపాలికలో ఇటీవల టీయూఎఫ్‌ఐడీసీ నిధులు సుమారు రూ.5కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను గురువారం ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని ఆమె గుత్తేదార్లకు సూచించారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, కౌన్సిలర్‌ శ్రీనాథ్‌ గౌడ్‌, ప్రవీణ్‌కుమార్‌, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.


పాఠశాలలకు భగీరథ నీరు

కొడంగల్‌, న్యూస్‌టుడే: మున్సిపల్‌ పరిధిలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాలలకు మిషన్‌ భగీరథ నీరును అందించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం వేసవి రావడంతో విద్యార్థులు తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వెంటనే రెండు పాఠశాలలకు తాగునీటి పైపులైన్‌ వేసి తాగునీరు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీీపీీ ముద్దప్ప, కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌, మిషన్‌భగీరథ డీఈ శశాంక్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని