Updated : 05/03/2021 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాల రూపకర్త.. భావి ఆవిష్కర్త

మల్కాపూర్‌లో విద్యార్థులతో ఉపాధ్యాయులు

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ: పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఉన్నత పాఠశాలలకు ‘అటల్‌ టింకరింగ్‌’ ప్రయోగశాలలను మంజూరు చేసింది. ఆధునిక సాంకేతిక పరికరాలు, సామగ్రిని సమకూర్చింది. వివిధ దశల్లో అందుబాటులోకి వస్తున్న వీటిని క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే వేలాదిమంది విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు తోడ్పడనుంది.

సాంకేతికతను గ్రామీణ విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలోని కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. తద్వారా నగరాలు, పట్టణాల్లోని కార్పొరేట్‌ విద్యార్థుల పోటీని తట్టుకునేలా తీర్చిదిద్దవచ్చని ఆకాంక్షిస్తోంది. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌లో నియోజకవర్గాల్లోని 29 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వీటిని కేటాయించింది. 400కు పైగా విద్యార్థులున్న పాఠశాల స్థితిగతులను అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. రేపటి పౌరుల వినూత్న ఆలోచనలను గుర్తించి మెరుగులు దిద్దాలని సంకల్పించారు. సకల వసతులు కల్పించి కొత్త ఆవిష్కరణల రూపకర్తలుగా మార్చాలని ప్రణాళికలు రూపొందించింది.

తాండూరు, యాలాల మండలాల్లో..: తాండూరు మండలం మల్కాపూర్‌, చెంగోల్‌, యాలాల మండలం అగ్గనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలకు రూ.12లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. వీటి ద్వారా మూడు ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్‌, బల్లలు, ఫర్నిచర్‌, ఇతర పరికరాలు, యంత్రాల విడిభాగాలను సమకూర్చింది. మల్కాపూర్‌, అగ్గనూరుల్లో ఆకర్షణీయంగా గది పరిసరాలను సిద్ధం చేసినా, వినియోగంలోకి తేలేదు. రెండురోజులపాటు శిక్షణ ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు పట్టించుకోవడంలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మల్కాపూర్‌ పాఠశాలలో మల్కాపూర్‌, కొత్లాపూర్‌, ఐనెల్లి, కోటబాస్పల్లి, సంగెంకలాన్‌కు చెందిన 464 మంది విద్యార్థులు చదువుతున్నారు. నూతన ప్రయోగశాలను అందుబాటులోకి తెస్తే వీరంతా విజ్ఞానం పెంచుకునే వీలుంటుంది. అగ్గనూరులో కొన్నినెలలు వినియోగించారు. లాక్‌డౌన్‌తో మూలకు చేరాయి. తాజాగా మళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రదానోపాధ్యాయులు వెంకటస్వామి వెల్లడించారు. చెంగోల్‌లో ప్రయోగశాల మంజూరైనప్పటికి ఏర్పాటు చేయలేదని ఉపాధ్యాయులు తెలిపారు.


ప్రయోజనాలిలా

* విద్యార్థుల్లో ప్రయోగాలపై ఉత్సాహం పెరగనుంది.

* వివిధ రంగాల సాంకేతిక సామగ్రిని అందుబాటులో ఉంచడంతో పిల్లలు తమ ఆలోచనలకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలను తయారు చేసేందుకు తోడ్పడుతుంది.

* బట్టీ విధానానికి అడ్డుకట్ట పడుతుంది. శాస్త్రీయ అవగాహనకు దోహదం.

* హాజరు పెరుగుతుంది. నేర్చుకోవాలన్న తపనతో రాణింపు.

* బోధనతోపాటు ప్రయోగాలు చేయడంతో వివిధ అంశాలపై అవగాహన పెరిగి ఉత్తమ ఫలితాలు.

* పాఠశాల స్థాయిలోనే ఆవిష్కరణలకు బాటలు.

* జిల్లాలో అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలలు ● రూ.3.48 కోట్లతో 29 మంజూరు.


అంశాలను గుర్తుంచుకునే వీలు

పుష్పలత, శ్రావణి 10వ తరగతి, చెంగోల్‌, జడ్పీహెచ్‌ఎస్‌

అన్ని సదుపాయాలతో ప్రయోగశాల అందుబాటులోకి తెస్తే సునాయసంగా ప్రయోగ పాఠాలను నేర్చుకుంటాం. పాఠాలు వినడంతోపాటు నేరుగా ప్రయోగాలు చేయడం వల్ల ఎక్కువకాలం అంశాలను గుర్తుంచుకునేందుకు తోడ్పడుతుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.


ఆలోచనలకు అనుగుణంగా తయారీ

శివకుమార్‌, మహేందర్‌, 9వ తరగతి, మల్కాపూర్‌

ప్రయోగశాలలో పరికరాలు, రోబోటెక్‌ సామగ్రిని సమకూర్చారు. వీటి ద్వారా ఉపాధ్యాయుల సూచనలు, ప్రోత్సాహంతో ఆసక్తి ఉన్న పరికరాలు, యంత్రాలను సొంతంగా తయారు చేయగలుగుతాం. వెంటనే వినియోగంలోకి తేవాలి.


శిక్షణ ఇవ్వాల్సి ఉంది

వైద్యనాథ్‌, ప్రధానోపాధ్యాయులు, మల్కాపూర్‌.

మారుమూలనున్న మల్కాపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌కు విలువైన ప్రయోగశాల మంజూరైంది. ప్రత్యేక గదిలో దీన్ని ఏర్పాటు చేయించాం. సామగ్రి వినియోగంపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అది పూర్తైన వెంటనే ప్రారంభిస్తాం. అయిదు గ్రామాలకు చెందిన పేదవిద్యార్థులకు సాంకేతిక పరికరాలు, సామగ్రితో ప్రయోగాలు చేయడం, కొత్త ఆవిష్కరణలు రూపొందించేందుకు అవకాశాలు లభిస్తాయి.


పరిశీలించి పర్యవేక్షిస్తాం

రేణుకాదేవీ, జిల్లా విద్యాధికారిణి

జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ప్రయోగశాలలను టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేయిస్తున్నాం. పేద విద్యార్థులుండే గ్రామీణ ప్రాంత పాఠశాలలకు విలువైన ప్రయోగశాలలు, సామగ్రి సమకూర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది. సైన్స్‌పరంగా విద్యార్థులు రాణించే వీలుంది. ల్యాబ్‌లను సద్వినియోగం చేసి విద్యార్థులకు ప్రయోగ పాఠాలు నేర్పించేలా పర్యవేక్షణ చేస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని