
అమ్మాలన్నా కొనాలన్నా.. డబ్బు ఇవ్వాల్సిందేనన్నా!
నగరంలో కొన్ని కాలనీ సంఘాల బలవంతపు వసూళ్లు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
కంటోన్మెంట్‌లోని వాసవీనగర్ సామాజిక భవనం
మహానగరంలో కొత్త రీతిలో జరుగుతున్న ఓ దందా విస్తుగొలుపుతోంది. కొన్ని కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు తమ కాలనీలో ఇళ్లను, స్థలాలను అమ్మే వారు, కొనే వారు ఇద్దరి వద్దా భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇది దారుణమని మొత్తుకుంటున్నా ఖాతరు చేయడంలేదు. అడిగినంత ఇస్తేనే సాఫీగా సాగేలా చూస్తామంటూ కొన్ని కాలనీ సంఘాల ప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవన్న ఉద్దేశంతో అడిగినంత ఇచ్చేస్తున్నారు అమ్మకందారులు, కొనుగోలుదారులు. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న వసూళ్లపై బల్దియా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
నగర పరిధిలోని పది వేలకు పైగా కాలనీల్లో అయిదారు వేల కాలనీలకు సంక్షేమ సంఘాలున్నాయి. ఈ సంఘాలకు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఇంటి నుంచి ఏటా ఇంత మొత్తం వసూలు చేస్తుంటారు. ఆ మొత్తంతో కాలనీలో కొన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంటారు. చిన్న చిన్న అభివృద్ధి పనులూ చేపడుతుంటారు. ఇలా ఆదర్శంగా నడుస్తున్న కాలనీలు వందల్లోనే ఉన్నాయి. ఇంతవరకు పర్వాలేదు కానీ, కొన్ని కాలనీ సంక్షేమ సంఘాలు బలవంతంగా వసూళ్లు చేయడమే వివాదాలకు దారితీస్తోంది. పెద్దఎత్తున విమర్శలు రేగుతున్నాయి. ఆయా కాలనీల్లో ఇళ్లను గానీ స్థలాలను గానీ అమ్మాలంటే తమ అనుమతి తప్పనిసరని ప్రతినిధులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. తమ కనుసన్నల్లోనే క్రయవిక్రయాలు జరిగేలా చూసుకుంటున్నారు. తమకు చెప్పకుండా చేపడితే ఇరు వర్గాలను వివిధ రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు.
వాసవీనగర్ కాలనీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్: రెండు వందలకు పైగా ఇళ్లున్న ఈ కాలనీలో సంక్షేమ సంఘం సరికొత్త నిబంధన తెచ్చింది. తమ కాలనీలో ఇళ్లుగానీ స్థలాలు గానీ విక్రయిస్తే అమ్మిన వారు రూ.50 వేలు, కొన్నవారు రూ.50 వేలు చెల్లించాలని హకుం జారీ చేసింది. డబ్బు ఇవ్వకపోతే క్రయవిక్రయాలకు అడ్డుపడుతున్నారని, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ కాలనీ వాసులు అనేకమంది ఆరోపించారు. ఈ కాలనీకి చెందిన సురేష్ తమ స్థలాన్ని విక్రయానికి పెడితే రెండు వైపుల కలిపి రూ.లక్ష ఇవ్వాల్సిందేనని సంక్షేమ సంఘం పట్టుబట్టింది. నిబంధనల ప్రకారం తాము ఇవ్వాల్సిన అవసరం లేదని అవసరమైతే కోర్టుకు వెళతానని చెప్పినా వినలేదు.
నగర పరిధిలో ఉన్న కాలనీలు: 10 వేలు
సంక్షేమ సంఘాలున్నవి: 5-6 వేలు
సంఘాల ఎన్నికలు: రెండేళ్లకోసారి
మరో కాలనీలో రూ.3 లక్షలు
కంటోన్మెంట్‌లోనే మరో కాలనీలో రెండు వైపులా కలిపి మొత్తం మీద రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారు. అంత మొత్తం ఇవ్వకపోతే అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభావం పడేలా ఏదో ఒకటి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కంటోన్మెంట్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో..
కేవలం కంటోన్మెంట్‌లోనే కాకుండా కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లోనూ ఈ దందా కొనసాగుతోందని కాలనీ వాసులు వాపోతున్నారు. జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* ఈ విషయమై బల్దియా అదనపు కమిషనర్ ఒకరు ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. తమకు ఇలాంటి ఫిర్యాదులేవీ రాలేదని బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామన్నారు.
బైలాస్ ప్రకారమే: టి.సతీష్‌కుమార్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
కాలనీ సంక్షేమానికే ఈ డబ్బు వసూలు చేస్తున్నాం. ఆ మొత్తాన్ని కాలనీ అవసరాలకే వెచ్చిస్తున్నాం.