Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌పై అవగాహనకు ప్రత్యేక గేమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా ప్రబలిన తరుణంలో ఐక్యంగా ఉండటం ద్వారా ఎలా ఎదుర్కోవచ్చు? దేశాల మధ్య సహకారం ఎలా ఉండాలి? వైరస్‌ వ్యాప్తితో ప్రజల ఆరోగ్యంపై ఎలా ప్రభావితమవుంది? ఇలాంటి విషయాలపై చిన్నారుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ట్రిపుల్‌ఐటీ ఆచార్యులు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ గేమ్‌ను రూపొందించారు.  
అగస్త్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభ కలిగిన 70 మంది చిన్నారులను ఎంపిక చేసి 15 రకాల అంశాలపై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తోంది. కొవిడ్‌ తరుణంలో నగరాలు, దేశాలు వ్యవహరించాల్సిన తీరుపై కూడా శిక్షణ ఇస్తున్నారు. దేశాల మధ్య సహకారంపై ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్‌ గేమ్‌ డిజైన్‌ చేయాలని ఫౌండేషన్‌ సలహాదారు ఎంజీ సుబ్రమణియన్‌ గతేడాది ట్రిపుల్‌ఐటీని సంప్రదించారు. వర్సిటీలోని కాగ్నిటివ్‌ సైన్స్‌ ఆచార్యురాలు ప్రొ.వేమూరి కవిత నేతృత్వంలో  ఆటను రూపొందించారు. ప్రస్తుతం గేమ్‌ను చిన్నారులకు తరగతి గది పాఠంగా అందుబాటులో ఉండగా, రానున్న రోజుల్లో  చిన్నారులందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని ఎంజీ సుబ్రమణియన్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

సహకారం పెంచుకుంటూ.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలలో పూర్తిస్థాయిలో వసతులు ఉండవు. గేమ్‌లో దేశాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నారులు తమ వద్ద ఉన్న వసతులను వేర్వేరు దేశాలతో పంచుకున్నప్పుడు వారికి యూనిట్స్‌ (పాయింట్స్‌) లభిస్తాయి. ఎవరు ఎక్కువగా వసతులు పంచుకుంటే వారికి ఎక్కువగా పాయింట్స్‌ లభిస్తాయి. ‘‘ గేమ్‌ తయారీకి  వివిధ దేశాలకు సంబంధించి రియల్‌టైమ్‌ డాటాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌ నుంచి తీసుకున్నాం.’’ అని ప్రొ. వేమూరి కవిత తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని