Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బోటు షికారుపై కరోనా పిడుగు!

ఈనాడు - హైదరాబాద్‌

జంట నగరాలకు తలమానికంగా ఉండే హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు అంటే ఎవరైనా హుషారుగా అడుగులు వేస్తారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులే కాదు.. నగరంలో ఉండే వారు కూడా ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం కరోనా రెండో దశ నేపథ్యంలో బోటెక్కేందుకు భయపడుతున్నారు. లుంబినీ పార్కు సందర్శకుల సంఖ్య కూడా తగ్గిపోయింది. రోజూ 5 వేల నుంచి 6 వేల మందికి తగ్గకుండా బోటు షికారు చేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 1000 నుంచి 1500కు పడిపోయింది. వారాంతాల్లో నిర్వహణ ఖర్చులు మిగులుతున్నా.. మిగతా రోజుల్లో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని తెలంగాణ పర్యాటక అధికారులు వాపోతున్నారు. ఎండా కాలంలో ఎప్పుడూ రద్దీగా ఉండే బోటు షికారు.. ఈ సారి ఖాళీగా కనిపిస్తోంది.
చిన్న బోట్ల పరిస్థితీ అదే..
హుస్సేన్‌సాగర్‌లో 100, 80, 50 మంది సామర్థ్యం ఉన్న బోట్లు ఎప్పుడూ సాంస్కృతిక కార్యక్రమాలు, పార్టీలతో సందడిగా కనిపించేవి. ఇప్పుడు ఒక బోటుకు సరిపడా సందర్శకులు కూడా ఎక్కడం లేదు. అయిదుగురు సామర్థ్యం ఉన్న రాజహంస బోట్ల పరిస్థితీ అలాగే ఉంది. రోజూ రూ.4 లక్షల వరకు ఆదాయానికి గండి పడుతోందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం
-సంపత్‌, లుంబినీ బోటు షికారు యూనిట్‌ అధికారి

కరోనా మహమ్మారి నేపథ్యంలో జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం గంటకోసారి పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేయిస్తున్నాం.. మాస్కు లేనిదే అనుమతించడం లేదు. వీటికి తోడు లైఫ్‌ జాకెట్లు తప్పనిసరి చేశాం. వాటిని ఎండలో పెట్టి.. రెండు గంటల తర్వాత శానిటైజర్‌ చల్లి వినియోగించేలా చూస్తున్నాం. 100 మంది సామర్థ్యం ఉన్న బోటులో గతంలో వేడుకలు, భోజనాలు జరిగేవి. ఇప్పుడవేవీ అనుమతించడం లేదు. పర్యాటకుల శరీర ఉష్ణోగ్రత పరీక్షిస్తున్నాం. 50 శాతం మందిని మాత్రమే పెద్ద బోట్లలో అనుమతిస్తున్నాం. ఎలాంటి సంకోచం లేకుండా బోటు షికారుతో సేదదీరొచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని