Published : 21/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫలితాలు సత్వరం.. సమస్యలు దూరం

రైతు వేదికల్లో భూసార పరీక్షలు

ఏర్పాట్లలో వ్యవసాయశాఖ అధికారులు


పరీక్షలు చేస్తున్న ఏఓ

న్యూస్‌టుడే, వికారాబాద్‌ టౌన్‌: పంటలు బాగా పండాలంటే భూసారం బాగుండాలి. అసలు సాగుకు భూమి అనుకూలమా కాదా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి. దీనికి ఒకే ఒక మార్గం...భూసార పరీక్ష. రైతులకు ప్రభుత్వ పథకాలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో రైతు వేదికలను నిర్మిస్తున్నారు. ఈసారి వీటిద్వారా భూసార పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో నేల సామర్థ్యం తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం మట్టి నమూనాలు సేకరించేవారు. ఇక రైతు వేదికల ద్వారా ఇది అమలు కాబోతోంది. దీనివల్ల రైతులకు మరింత మేలు కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

శిక్షణ, సలహాలు, సూచనల కోసం...

జిల్లాలో 18 మండలాలు, వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాలున్నాయి. పూర్తి వ్యవసాయాధారిత జిల్లాలో సహజ వనరులేవీ లేకపోవడంతో రైతులు వర్షాధారంగానే సాగు చేస్తుంటారు. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మండల స్థాయిలో వ్యవసాయాధికారులున్నారు. పెట్టుబడి కష్టం రాకుండా ఉండేందుకు ఖరీఫ్‌, రబీ పంటల పండించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సమగ్ర వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టింది. రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి పంపిణీ చేయడం దగ్గర నుంచి రైతులకు సాగులో సలహాలు సూచనలు అందించేందుకు అవసరమైన శిక్షణ కోసం సమావేశాలు నిర్వహించడానికి ప్రతి వ్యవసాయ క్లస్టర్‌ పరిధిలో అన్ని సాంకేతిక హంగులతో ‘రైతు వేదిక’లను నిర్మించడం మొదలు పెట్టింది. వీటిలోనే ఈసారి భూసార పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాగులో వ్యవసాయ భూమి

5.90 లక్షల ఎకరాలు

రైతులు: 2.24 లక్షలు

● జిల్లాలో సగానికి సగం మంది రైతులు భూసార పరీక్షలపై సరైన అవగాహన లేక సంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు పండిస్తున్నారు. అంతేకాదు తమ భూముల రకాలు తెలుసుకోలేక అధిక దిగుబడుల కోసమని అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టారీతిన రసాయన ఎరువులను పంటలపై చల్లుతున్నారు. ప్రతి రైతు భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నా ఇందుకు సరైన వసతులు లేకపోవడంతో ఫలితాలు రావడంలో జాప్యం జరుగుతోంది. అప్పటికే రైతులు పంటలు వేస్తుండటంతో పరీక్షల లక్ష్యం నెరవేరడం లేదు. ఇదికూడా ఒక కారణంగా ప్రభుత్వం గుర్తించి రైతు వేదికల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

వెంటనే ఫలితాలు: గతంలో మట్టి పరీక్షల గురించి రైతులను చైతన్య పరిచేందుకు క్లస్టర్‌ ఏఈఓల వారీగా మినీ భూసార పరీక్ష కేంద్రాలను (ల్యాబ్‌లను) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవన్నీ రైతులకు దగ్గరలో ఉండేవి కావు. మట్టి నమూనాలను వీటికి పంపడం, ఆ నివేదికలు రావడం అంటే చాలా సమయం పట్టేది. దీనివల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి రైతు వేదికల్లో మట్టి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధానంవల్ల పరీక్షా ఫలితాలు త్వరగా అందుతాయి.

పంటల వివరాలు

ఖరీఫ్‌: పత్తి, మొక్కజొన్న, పెసర, పల్లి, వరి, కంది, ఆముదం, మినుములు

రబీ: వరి, జొన్న, జనుము, చెరకు, శనగలు, కూరగాయలు, గోధుమ, పండ్లు

త్వరలోనే పూర్తయిన వేదికల్లోకి మారుస్తాం

- గోపాల్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

రైతు వేదికల్లో మట్టి పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముందుగా ఏ గ్రామంలో అయితే రైతు వేదికలు పూర్తయ్యాయో వాటిలో ఏర్పాటు చేస్తాం. గతంలో ప్రభుత్వం చేసిన మినీ ల్యాబ్‌లను ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో రైతు వేదికల్లోకి మార్చి ఉపయోగంలోకి తీసుకువస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని