Published : 21/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంరక్షణ మరిచి.. స్వలాభమెంచి..!

 ఆలయ భూముల అన్యాక్రాంతం

 మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు


పూడూరు మండలం చన్‌గోముల్‌లో ఫోర్జరీ సంతకంతో రిజిస్ట్రేషన్‌

చేయించుకున్న 14 ఎకరాల గోపాలస్వామి దేవాలయం భూములు

* వికారాబాద్‌ ఆలంపల్లి సన్యాసి మఠానికి వివిధ సర్వే నంబర్లలో 20.10 ఎకరాల భూములున్నాయి. వాటిని మఠం స్వాములు తమ పేరు మీద పట్టాలుగా మార్చుకున్నారు.

* తాండూరు మండలం అగ్గనూరులో సర్వే నంబరు 72లో దేవాదాయ శాఖకు 18 ఎకరాల భూమి ఉంది. ఇందులో కేవలం రెండు ఎకరాలు మాత్రమే మిగిలింది. మిగతాదంతా ప్రైవేటు వ్యక్తుల పేర్లతో నమోదయ్యాయి. దేవాదాయశాఖకు సమాచారం లేకుండా ఆర్డీఓ పట్టా చేసినట్లు అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తులు రెండేళ్ల క్రితమే 14 ఎకరాలు అమ్ముకుని వెళ్లిపోయారని సమాచారం.

* దోమ మండలం బొంపల్లి సర్వే నంబరు 199/1, 199/2లో మొత్తం 15.19 ఎకరాలు హనుమాన్‌ మందిరానికి చెందిన ఇనాం భూములను ఓఆర్సీ (ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌) లేకుండా పట్టాలుగా మార్చుకున్నారంటూ రెవెన్యూ సిబ్బందే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

ఆలయ ఆస్తులను సంరక్షించాల్సిన వారే అడ్డదారుల్లో వెళుతున్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖలోని కొంత మంది అధికారులు, ఆలయ అర్చకుల్లో కొందరు కలిసి రూ.కోట్ల విలువైన భూములను అక్రమార్కులకు అప్పజెప్పి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో 248 ఆలయాలకు సంబంధించి దేవాదాయ శాఖ పరిధిలో 2,026 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటికి సంబంధించి 2017లో దేవాలయం, పంచాయతీ, సర్వే నంబరు, భూమి విస్తీర్ణంతో పూర్తి స్థాయి నివేదికను దేవాదాయ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు అప్పగించారు. అయితే 30 ఏళ్ల నుంచి ఆలయ అర్చకులు, వారి బంధువులు, ప్రైవేటు వ్యక్తులు కలిపి 400 ఎకరాలు కబ్జా చేసినట్లు అంచనా. భూ యజమాని స్థానంలో దేవాలయ, ఇనాం పేర్లు తొలగించి, ప్రైవేటు వ్యక్తుల పేర్లు నమోదు చేయిస్తున్నారు. ఇలా దక్కించుకున్న వాటిని వెంటనే అమ్మకానికి పెడుతున్నారు. దేవాదాయ శాఖలో ఒక్కో ఉద్యోగికి మరికొన్ని ఆలయాల అదనపు బాధ్యతలు ఉండటంతో పనిఒత్తిడి పెరిగి పర్యవేక్షణ కొరవడింది. ఇదే అదునుగా అక్రమార్కులు అన్యాక్రాంతం చేస్తున్నారు. వీటిని అధికారులు గుర్తించే లోపే క్రయ, విక్రయాలు జరిగిపోతున్నాయి. ఈ వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొరవడిన చిత్తశుద్ధి: వికారాబాద్‌ పట్టణం ఆలంపల్లి సన్యాసి మఠం భూములు అన్యాక్రాంతమయ్యాయి. అయితే రైతు బంధు డబ్బులు రావడం లేదని సదరు వ్యక్తి దరఖాస్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారించిన అధికారులు దేవుని భూములని, స్వాధీనం చేసుకోవాలని నివేదిక ఇచ్చారు. పరిగి పట్టణంలోని గోపాలస్వామి దేవాలయానికి చన్‌గోముల్‌ పంచాయతీలో 14 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ చేయించడంలో అధికారులు హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే విషయం బయటకు వచ్చాక ఫోర్జరీ సంతకంపై కేసు నమోదైంది, రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని కోరినా సంబంధిత శాఖ సిబ్బందిలో చలనం కనిపించడం లేదు.

కబ్జా అయిన వాటిని స్వాధీనం చేసుకుంటాం

కృష్ణ, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌

దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను సంరక్షిస్తాం. కొంత మంది స్వార్థ ప్రయోజనాలకు ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని వెంటనే పరిశీలించి తొలగిస్తున్నాం. ఇటీవల వికారాబాద్‌లో అనంతపద్మనాభ స్వామి భూములను స్వాధీనం చేసుకున్నాం. కబ్జాకు గురైనట్లు అధికారులకు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని