Published : 21/04/2021 03:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంద్ కరోనా!

 మూడు కమిషనరేట్లలో పకడ్బందీగా ‘రాత్రి కర్ఫ్యూ’

 10వేల మంది సిబ్బంది.. 100కు పైగా చెక్‌పోస్టులు

ఈనాడు, హైదారబాద్‌

కర్ఫ్యూ కారణంగా బస్సులన్నీ డిపోలకు పరిమితం కావడంతో మెహిదీపట్నం

బస్టాపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ కుటుంబం

కరోనా విజృంభిస్తున్న వేళ ‘రాత్రి కర్ఫ్యూను’ కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి కారణం లేకుండా రోడ్డెక్కే ఉల్లం‘ఘనుల’ పని పట్టేందుకు వందకు పైగా చెక్‌పోస్టులు,  సుమారు పదివేల మంది సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు.  ఉల్లంఘనులకు మొదటిసారి తప్పు చేస్తే ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇస్తారు. రెండోసారి కూడా పట్టుపడితే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్టు-2005 సెక్షన్‌ 51 నుంచి 60, ఐపీసీ 188 సెక్షన్‌ కింద వ్యక్తులపై కేసులు పెడతారు. వాహనాన్ని సీజ్‌ చేసి ఠాణాకు తరలిస్తారు. సైబరాబాద్‌లో 40, రాచకొండలో 46, హైదరాబాద్‌లో 21 చోట్ల చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. రాచకొండలో 3వేలు, సైబరాబాద్‌లో 3వేలు, హైదరాబాద్‌లో 4,500 మంది సిబ్బందిని రంగంలోకి దించినట్లు అధికారులు వివరించారు.

బేగంపేట కూడలి వద్ద పోలీసుల తనిఖీలు

ఎక్కడికి.. ఎందుకో చెప్పాలి..
అత్యవసరంగా బయటికొచ్చే వారు సహేతుకమైన కారణం చూపాలని, అన్ని సక్రమంగా ఉంటే వారిని పోలీసులు ఇబ్బంది పెట్టొద్దని సీపీలు హెచ్చరించారు.  ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, గర్భిణులు, వృద్ధులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు.

ట్యాంక్‌బండ్‌ వద్ద..

టిక్కెట్‌ చూపించి వెళ్లొచ్చు.. రైల్వే స్టేషన్లు, బస్సులు, విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లేవారిని ఆపినపుడు టిక్కెట్‌ లేదా తమ వారి ఫొటో/నకలు ప్రతిని చూపించాలని వివరిస్తున్నారు.ఆటో, క్యాబ్‌లు, ఇతర ప్రైవేట్‌ వాహనాలు ఖాళీగా తిరిగేందుకు అనుమతించరు. ఒకవేళ ఆ వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే వారు ఉంటే టిక్కెట్‌, ఐడీ కార్డు, ఇతరత్రా ఆధారాలను చూపించాలి.
పాసుల కోసం రావొద్దు..: గతేడాది లాక్‌డౌన్‌లో జారీ చేసిన పాస్‌లు ఇప్పుడు చెల్లవని స్పష్టం చేశారు. ఈసారి అలాంటి తరహా పాస్‌లు జారీ చేయడం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం మినహాయించిన సేవలకు సంబంధించిన వాహనాలు, ఉద్యోగులు ఐడీ కార్డు లేదా సదరు సంస్థ జారీ చేసిన అధీకృత ధ్రువీకరణ పత్రం చూపిస్తే చాలని వివరిస్తున్నారు.


కోఠి ఆంధ్రాబ్యాంకు చౌరస్తాలో బందోబస్తు

కంట్రోల్‌ రూముకు 70 మంది ఫోన్‌

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 కంట్రోల్‌ రూముకు మంగళవారం 70 మంది ఫోన్‌ చేసినట్లు కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ ప్రకటించారు. కరోనా పరీక్ష, టీకా కేంద్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  మందుల గురించి, ఇతర సాయం కావాల్సిన వారు 040-2111 1111, 91546 86549, 91546 86558 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని కోరారు.

ఆంక్షల సమయం.. సేవలపై ప్రభావం

ఈనాడు, హైదరాబాద్‌: కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల్లో మార్పులు చేశారు.  నగరంలోని టెర్మినల్‌ మెట్రోస్టేషన్ల నుంచి రైళ్లు ఉదయం 6.30 నుంచి బయల్దేరుతాయి. చివరి రైలు రాత్రి 7.45 గంటలకు ఉంటుందని హైదరాబాద్‌ మెట్రో రైలుసంస్థ తెలిపింది. చివరి మెట్రోరైలు ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌కు రాత్రి 8.45 గంటలకు చేరుకుంటుంది. నగరంలో నడిచే ఆర్టీసీ సర్వీసులు కూడా రాత్రి 9 గంటలలోపు డిపోలకు చేరుతాయని ఆర్టీసీ ఆపరేషన్స్‌ ఈడీ యాదగిరి తెలిపారు. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు యథావిధిగా ఆయా సమయాల్లో నడుపనున్నారు. ఇక నగరంలో రాత్రివేళ సందడిగా కనిపించే హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్‌లను ముందుగానే మూసివేయనున్నారు.  
ప్రైవేటు రవాణాపై ప్రభావం..:  కర్ఫ్యూ నిబంధనలతో మరింత భారం పడుతుందని తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ, డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ షేక్‌ సలాఉద్దీన్‌ అన్నారు. ఇప్పటికే కొవిడ్‌ ఉద్ధృతితో క్యాబ్‌ల సర్వీసులు చాలా వరకూ తగ్గిపోయాయని పేర్కొన్నారు. రాత్రివేళల్లో గమ్యస్థానానికి చేరే వారిపై కర్ఫ్యూ ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


కర్ఫ్యూ కారణంగా ముందుగానే రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు

గడప దాటని ప్రజలు..!
పరిస్థితిని సమీక్షించిన పోలీస్‌ కమిషనర్లు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌వ్యాప్తంగా మంగళవారం రాత్రి కర్ఫ్యూ విజయవంతంగా అమలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనం స్వచ్ఛందంగా ఇంటికి పరిమితమయ్యారు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండగా, కాలనీలు రాత్రి 8.30గంటల నుంచే నిర్మానుష్యంగా కనిపించాయి. దుకాణాలు, షాపింగ్‌మాళ్లు, ఇతరత్రా వ్యాపార కేంద్రాలు సైతం మూతపడ్డాయి. సినిమాహాళ్లు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లనూ పోలీసులు మూసివేయించారు. రహదారులపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. మొదటిరోజు కావడంతో కార్యాలయాల నుంచి రాత్రి ఇంటికి చేరుకునే ఉద్యోగులు, సిబ్బంది అక్కడక్కడ కనిపించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలు ఆపి మాట్లాడారు. కర్ఫ్యూ ఉన్నా ఎందుకు తిరుగుతున్నారని మందలించి పంపించారు. మెహిదీపట్నం రైతుబజారు, సుల్తాన్‌బజార్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్‌, తిరుమలగిరి, సుచిత్ర, అల్వాల్‌, శామీర్‌పేట, ఈసీఐఎల్‌, మల్కాజిగిరి, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మియాపూర్‌, హైటెక్‌సిటీ, పాతబస్తీ, కోఠి, తార్నాక, తదితర ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. ఆనంద్‌బాగ్‌ ప్రాంతంలో విధులు ముగించుకుని వస్తున్న మహిళలను సురక్షితంగా ఇంటికి చేర్చాలని పోలీసులు ఆటోవాలాను ఆదేశించారు. బషీర్‌బాగ్‌ ప్రాంతంలో నగర సీపీ అంజనీకుమార్‌, నాగోల్‌ దగ్గర రాచకొండ కమిషనర్‌ మహేష్‌భగవత్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పరిస్థితిని సమీక్షించారు.

‘రాత్రి పది గంటల నుంచి కర్ఫ్యూ పెట్టాలి’


అసదుద్దీన్‌ ఒవైసీ

అబిడ్స్‌ : తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాస్త సడలించి రాత్రి 10 గంటల నుంచి అమలు చేస్తే బాగుంటుందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, సీఎస్‌లకు విన్నవించారు.  పాలు, నిత్యావసరాలు సరఫరా చేసే వారికి కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇవ్వాలని ట్విటర్‌ వేదికగా ఆయన కోరారు. కొవిడ్‌-19 రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంలో కేంద్రం, కోర్టులు జోక్యం చేసుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిధిలోకి వచ్చే అన్ని రకాల చర్యలను ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటోందని.. కేంద్రం, ఇతర సంస్థలు జోక్యం చేసుకొని ప్రజలకు ఇబ్బందికర పరిస్థితుల్ని సృష్టించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

నిర్మానుష్యంగా మారిన సైబర్‌ టవర్‌ కూడలి

మొజంజాహీ మార్కెట్‌ వద్ద పోలీసుల తనిఖీలు

చార్మినార్‌ వద్ద పహారా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని