Updated : 21/04/2021 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెడ్డీగ్యాంగ్‌లోని ఏడుగురికి ఐదేళ్ల జైలు

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడే ఏడుగురు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలకు న్యాయస్థానం మూడు కేసుల్లో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3,000 జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని అకోలా జిల్లా ఖిడ్కీ గ్రామానికి చెందిన చౌవాన్‌ తారా సింగ్‌(30), మహ్మద్‌ సోనూ(24), బిట్టూ(25), గుఫ్తాన్‌(20), సైఫ్‌ అలీ(20), సాధిక్‌(20), మహ్మద్‌ సాజిద్‌(45) కలసి ఓ ముఠాగా  దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. మహారాష్ట్రతోపాటు రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణలో పగలు దుప్పట్లు అమ్ముకుంటున్నట్లుగా శివారు ప్రాంతాలు తిరుగుతూ దొంగతనం చేసే ఇంటిని ఎంచుకుంటారు. అర్ధరాత్రి కాగానే ముఠా సభ్యులు చెడ్డీలు ధరించి మారణాయుధాలు పట్టుకొని ఎంపిక చేసుకున్న ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి దోపిడీలకు పాల్పడతారు. ఇతర రాష్ట్రాలలో ఈ ముఠా ’ఘుమాన్‌ గ్యాంగు’గా తెలంగాణలో ’చెడ్డీ గ్యాంగు’గా పేరు పడింది. 2019లో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో   8 వరుస దొంగతనాలకు పాల్పడింది. హయత్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగిన మూడు కేసుల దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులతోపాటు ఎస్‌వోటీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో 2019 డిసెంబరు 29న ఏడుగురు సభ్యులు పట్టుబడ్డారు. వారి నుంచి పోలీసులు 150 తులాల బంగారు ఆభరణాలు, 400 తులాల వెండి వస్తువులు, రెండు పదునైన కత్తులతో పాటు కొంత నగదు స్వాధీనపర్చుకున్నారు. గత ఏడాది ఏడుగురిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. హయత్‌నగర్‌ ఠాణా పరిధిలోని కేసుల్లో ముఠాపై పోలీసులు మోపిన అభియోగాలు నిరూపితమయ్యాయి. సైబరాబాద్‌ రెండో అదనపు సహాయ సెషన్స్‌ న్యాయమూర్తి పావని ఈ మేరకు నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పులు వెలువరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని