Published : 21/04/2021 05:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మల్లాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఎగిసిపడిన మంటలు

ఈనాడు, హైదరాబాద్‌, మల్లాపూర్‌, న్యూస్‌టుడే

మంటలను అదుపులోకి తెస్తున్న సిబ్బంది

అది మల్లాపూర్‌ పారిశ్రామిక వాడ.. చుట్టూ రసాయన పరిశ్రమలు.. మధ్యలో ఉన్న ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు ఎగిసి పడ్డాయి. రసాయన పరిశ్రమలకు వ్యాపిస్తే భారీ ప్రాణ నష్టం తప్పదంటూ కార్మికులంతా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. ‘లోటస్‌’ అనే ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ.3.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

వెల్డింగ్‌ పనులు చేస్తుండగా..

మల్లాపూర్‌ పారిశ్రామికవాడలో మిట్టల్‌ అనే వ్యక్తి అయిదు పరిశ్రమలు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న దాంట్లో ప్లాస్టిక్‌ కుర్చీలను తయారు చేస్తుంటారు. ఉదయం 10 గంటల సమయంలో వెల్డింగ్‌ పనులు నిర్వహిస్తుండగా నిప్పులు చెలరేగాయి. పక్కనే ఉన్న కుర్చీల తయారీకి వినియోగించే రసాయన డబ్బాలకు అంటుకుని మంటలు ఎగిసి పడ్డాయి. అప్పుడు విధుల్లో ఉన్న 10 మంది మహిళా కార్మికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.పరిశ్రమ మొత్తం మంటలు వ్యాపించడంతో బయటకు పరుగులు తీశారు. పక్కనే రసాయన పరిశ్రమల్లోని రియాక్టర్లు, సిలిండర్లకు మంటలు అంటుకుంటే భారీ ప్రాణ నష్టం తప్పదంటూ కార్మికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అగ్నిమాపక శాఖాధికారులు మల్కాజిగిరి, తార్నాకకు చెందిన అయిదు అగ్నిమాపక శకటాలను అక్కడికి రప్పించారు. స్థానికులు, ప్రైవేట్‌ ట్యాంకర్ల నిర్వాహకుల సహకారంతో సిబ్బంది సుమారు అయిదు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

కనీస జాగ్రత్తలు కరవు

రేకుల షెడ్‌లో నిర్వహించే ఈ పరిశ్రమలో 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు.కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు తేల్చారు. దీనికి ఆరు నెలల కింద అనుమతులు ఇచ్చినట్లు ఐలా అధికారులు చెబుతున్నారు. అయితే.. రెండేళ్ల నుంచి ఈ పరిశ్రమ నడుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని