Published : 21/04/2021 05:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గడువు తరుముకొస్తున్నా.. అనుసంధానం అంతంతే!

మీటర్లు పెట్టుకోవటానికి ముందుకురాని లబ్ధిదారులు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఉచిత మంచినీటి పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల నుంచి పెద్దగా స్పందన కన్పించడం లేదు. మరో పది రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటివరకు మీటర్లు ఉన్న వారిలో 1.4 లక్షల నల్లా కనెక్షన్‌దారులు మాత్రమే తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా దాదాపు 10.08 లక్షల మంది నల్లా కనెక్షన్‌దారులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇందులో 1.96 లక్షల నల్లాలు మురికి వాడల్లో ఉన్నాయి. మరో 7.87 లక్షల వ్యక్తిగత నల్లాలున్నాయి. వీరిలో కేవలం 2.20 లక్షల మందికి మాత్రమే నీటి మీటర్లున్నాయి. మిగతా 5.67 లక్షల నల్లాలకు ఎలాంటి మీటర్లు లేవు. ఈ పథకం కిందకు రావాలంటే ఏప్రిల్‌ 30 లోపు వీరంతా నీటి మీటర్లు అమర్చుకోవాలి. అయితే, ఇప్పటివరకు 50-60 వేల లోపు మాత్రమే మీటర్లు పెట్టుకున్నారు. అనుసంధానం అయిన నల్లాలకు మాత్రమే ఉచిత నీటి పథకం అమలు చేసి మిగతా నల్లాలకు మే నెల నుంచి బిల్లులు జారీ చేసేందుకు జలమండలి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. గతేడాది డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు మొత్తం ఐదు నెలల బిల్లులు అందించనున్నారు.

అపార్ట్‌మెంట్ల వాసులదీ అదే తీరు..: ఈ పథకం కిందకు గ్రేటర్‌ వ్యాప్తంగా 24,967 అపార్ట్‌మెంట్లు రానున్నాయి. అయితే, అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఫ్లాట్‌ యజమాని తమ ఆధార్‌తో క్యాను నంబరును అనుసంధానం చేసుకోవాలి. పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లలో 10-15 మంది యజమానులు ఇంకా తమ పేర్లు అనుసంధానం చేసుకోలేదు. దీంతో ఇప్పటికే అనుసంధానం చేసుకున్న వారికి సైతం ఈ పథకం వర్తించే అవకాశం లేకపోవచ్చునని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

కొవిడ్‌ నేపథ్యంలో పొడిగిస్తారా...

గ్రేటర్‌ వ్యాప్తంగా కరోనా జడలు విప్పుతోంది. నిత్యం 700 పైనే కేసులు నమోదు అవుతున్నాయి. చాలా కుటుంబాల్లో సభ్యులంతా కరోనా బారిన పడుతున్నారు. కోలుకునేందుకు కనీసం 14 రోజుల సమయం పడుతోంది. ఈ తరుణంలో గడువులోపు ఇలాంటి కుటుంబాలు ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం కష్టమే. అంతేకాక మంగళవారం రాత్రి నుంచే కర్ఫ్యూ కూడా అమల్లోకి వచ్చింది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే గడువు మరోసారి పొడిగించే అవకాశం లేకపోలేదని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని