Published : 21/04/2021 05:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహమ్మారి గుప్పిట్లోకి గంటకు.. 72 మంది


కరోనా వ్యాక్సిన్ల కోసం కోఠిలోని పీహెచ్‌సీ వద్ద పేర్లు నమోదు చేయించుకుంటున్న స్థానికులు

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరంలోని మూడు జిల్లాల పరిధిలో కరోనా కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో గంటకు 72మందికి పైనే మహమ్మారి బారిన పడుతున్నారు. రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి, వనస్థలిపురం, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 793 మంది, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 488 మంది, రంగారెడ్డిలో 455 మంది వైరస్‌ బారిన పడ్డారు. గాంధీతోపాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 18 మంది మృతి చెందారు. ఇంతమంది చనిపోవడంతో ఇటీవల ఇదే తొలిసారి. మరోవైపు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఫలితం రావడానికి కొన్నిసార్లు 3-5 రోజులు సమయం పడుతోంది. మరికొన్నిసార్లు అసలు సమాచారమే ఉండటం లేదు. ల్యాబ్‌లపై విపరీతంగా భారం పడుతోందని, దీంతో ఫలితాలు వచ్చేసరికి జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటులో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.

ఉస్మానియాలో పెరుగుతున్న రోగుల రద్ధీ.

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రిలో రోగుల రద్దీ పెరుగుతోంది. అవుట్‌ పేషెంట్లతో పాటు ఇన్‌పేషెంట్‌ రోగుల రద్దీ పెరుగుతుంది. సోమ, మంగళవారాల్లో ఓపీతో పాటు ఇన్‌పేషెంట్ల సంఖ్య సగానికిపైగా పెరిగిపోయింది. సాధారణంగా రోజూ 70 నుంచి 80 మంది చొప్పున ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుంటారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ 130 మంది రోగుల్ని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకున్నారు.

శిథిలావస్థలో.. ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఏడాదిగా ఈ భవనాన్ని వాడకుండా తాళం వేశారు. రోగుల రద్దీ నేపథ్యంలో కులీకుతుబ్‌షా, ఓపీ, హౌస్‌ సర్జన్స్‌ క్వార్టర్లతో పాటు అవసరమైన ప్రత్యామ్నాయ స్థలాల్లో వార్డులు ఏర్పాటు చేసేలా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌, టీఎస్‌ఎంఐడీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

దంత వైద్యశాల పక్క భవనంలో..

ఉస్మానియా ప్రభుత్వ దంత వైద్యశాల పక్కనే రెండు అంతస్తుల భవనం ఖాళీగా ఉంది. ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే సుమారు 50 మంది రోగులకు వెసులుబాటు లభించే అవకాశం ఉంది.

వైరస్‌ వ్యాప్తికి ‘ఆధార్‌’మవనీయొద్దు!

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రాజధాని పరిధిలో ఐరిస్‌, వేలిముద్రల ద్వారా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న ఆధార్‌ కేంద్రాల్లో తగు నియంత్రణ చర్యలు చేపట్టాలని ఈఎస్‌డీ కమిషనర్‌ జి.టి.వెంకటేశ్వర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 17న ‘వైరస్‌ వ్యాప్తికి ఆధార్‌మవుతున్నాయ్‌!’ శీర్షికన ‘ఈనాడు’ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన కమిషనర్‌ ఈమేరకు ఆదేశాలిచ్చారు. అన్ని మీసేవా, ఆధార్‌ కేంద్రాల్లో రోజూ శానిటైజేషన్‌ చేయాలని, విధుల్లో ఉన్న సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కు లేకుంటే వినియోగదారుల్ని రానివ్వొద్దని, 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకే కేంద్రాల్ని కొనసాగించాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని