టీకా తీసుకున్న వారంతా కోలుకున్నారు
eenadu telugu news
Updated : 02/05/2021 04:27 IST

టీకా తీసుకున్న వారంతా కోలుకున్నారు

వారిలో ఒక్క మరణం కూడా సంభవించలేదు

గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు

ఈనాడు, హైదరాబాద్

టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత పలువురు కొవిడ్‌ బారిన పడినా తిరిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా కోలుకున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ఇలాంటి వారు ఇటీవల 15 మంది వరకు గాంధీలో చేరారన్నారు. వీరిలో కొందరికి వెంటిలేటర్లు కూడా అవసరమయ్యాయని, అయినా ఒక్కరు కూడా ఆరోగ్యం విషమించి చనిపోలేదన్నారు. చికిత్సలతో అందరూ కోలుకొని తిరిగి ఇళ్లకు వెళ్లారన్నారు. టీకా ద్వారా పూర్తిగా రక్షణ లభిస్తుందన్న దానికి ఇదే ఉదాహరణ అని డాక్టర్‌ రాజారావు వివరించారు. ఈ మేరకు శనివారం ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

పడకలు దొరక్కపోవడానికి ప్రధాన కారణం?

గాంధీలో ప్రస్తుతం 650 మంది ఐసీయూలో మరో 400 మంది ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. వీరిలో 10-15 శాతం మంది ఇంట్లో చికిత్స పొందిన వారే. మరో 5 శాతం మంది ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి రిఫర్‌ చేస్తున్నారు. 75 శాతం మంది మాత్రం ఇతర ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది డబ్బులు పొగొట్టుకొని ఆఖరి నిమిషంలో మా వద్దకు వస్తున్నారు. దీంతో గాంధీపై భారం ఎక్కువగా పడుతోంది. అంతేకాక చాలామంది భయంతో ముందే ఆసుపత్రిలో చేరుతున్నారు. ఫలితంగా పడకలు నిండిపోతున్నాయి. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి 95 కంటే ఎక్కువ ఉంటే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు.

మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి కదా?

గతంలో ఐసీయూలో 350 మంది ఉంటే... ప్రస్తుతం ఐసీయూలో 650 మంది వరకు ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగినట్లు కన్పిస్తోంది. సాంకేతికంగా చూస్తే మరణాల శాతం అప్పుడూ ఇప్పుడూ దాదాపు ఒకేలా ఉంది. అయితే రెండో విడతలో చాలా ఎక్కువ మంది వైరస్‌ బారిన పడుతున్నారు. 85 శాతం మంది సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారు.

కోలుకునే వారి శాతం ఎలా ఉంటోంది?

గాంధీలో తీవ్ర లక్షణాలు ఉన్నవారినే తీసుకుంటున్నాం. నిత్యం 60-70 మంది కోలుకొంటున్నారు. కొందరిలో ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ ఉండటంతో పరిస్థితి విషమిస్తోంది. మరికొందరిలో ఆక్సిజన్‌ శాతం 80-85 శాతానికి తగ్గినా.. కోలుకుంటున్నారు. తీవ్ర లక్షణాలతో వచ్చి వారికే రెమిడిసిన్‌విర్‌ ఇంజక్షన్‌ అందిస్తాం. అయితే అదేమీ సంజీవని కాదు. కొందరు కోలుకుంటున్నారు. మరికొందరిలో ఎలాంటి మార్పు ఉండదు.

ఆక్సిజన్‌ కొరత ఉందా?

గాంధీలో రోజూ ఆక్సిజన్‌ డిమాండ్‌ 25 టన్నులు. రెండో విడతలో డిమాండ్‌ భారీగా పెరిగింది. కేసుల సంఖ్య పెరగడం కూడా ఇందుకు కారణం. పటాన్‌చెరు ప్లాంట్‌ నుంచి ఎప్పటికప్పుడు తరలించి సిలిండర్లు నింపుతున్నాం. ఎలాంటి కొరత లేదు. సరఫరా సంస్థతో పకడ్బందీ ఎంవోయూ ఉంది. కాబట్టి రోగులు, బంధువులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొవిడ్‌ ఎవరిలో ఎలా మారుతుందో చెప్పడం కష్టమవుతోంది. కాబట్టి దాని బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా తీసుకున్నామనే ధీమా లేకుండా మాస్క్‌ ధరించాలి. చేతి శుభ్రత, సామాజిక దూరం పాటించడం చాలా అవసరం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని