Updated : 04/05/2021 04:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆధార్‌తో వస్తే.. టీకా లేదంతే

స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే అవకాశం

కొత్త విధానంతో సామాన్యుడికి ఇబ్బందులు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

కింగ్‌కోఠి ఆస్పత్రికి సోమవారం రెండో డోస్‌ టీకా కోసం వచ్చి నిరీక్షిస్తున్న జనం

కొవిడ్‌ టీకా వేసే విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయం గందరగోళంగా మారింది. ఇక నుంచి ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే టీకా ఇస్తామని సంబంధిత శాఖ ప్రకటించింది. దీనివల్ల సామాన్యులు టీకాకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నిర్ణయం రెండో డోసు తీసుకోవాల్సిన లక్షలాదిమందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే 20 రోజుల తరువాత గానీ ఆన్‌లైన్‌లో స్లాట్‌ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త ఆంక్షల వల్ల ఇప్పట్లో తమకు టీకా మొదటి డోసు దొరికే అవకాశాలు కన్పించడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో మొత్తం 1.20 కోట్ల మంది కరోనా నివారణ టీకా వేయించుకోవాల్సి ఉండగా.. ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మందికి వేశారు. రెండో డోసు కోసం దాదాపు మూడు లక్షలమందికిపైగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు నేరుగా టీకా కేంద్రానికి ఆధార్‌ కార్డుతో వెళితే అక్కడే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి వ్యాక్సిన్‌ వేసేవారు. టీకా డోసుల కొరత కారణంగా మూడు రోజులుగా నగరవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ప్రసుత్తం వైద్య ఆరోగ్య శాఖ దగ్గర టీకా నిల్వలు తక్కువగానే ఉన్నాయి.ఈ నేపథ్యంలో టీకా పంపిణీలో  కొత్త విధానం పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా టీకా వేయించుకునే వారు తప్పకుండా కొవిన్‌ యాప్‌లో సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్‌ లింక్‌ను ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. అందులో కావాల్సిన కేంద్రాన్ని టిక్‌ చేస్తే సంబంధిత వ్యక్తి ఫోన్‌కు ఎప్పుడు టీకా వేయించుకోవాలన్న మెసేజ్‌ వస్తుంది. ఈ మెసేజ్‌లోని తేదీ ప్రకారం సంబంధిత కేంద్రానికి వెళితే అప్పుడు టీకా వేస్తారు.

ఎన్నో అడ్డంకులు..అధిగమించే దెలా?
కొవిన్‌ యాప్‌లో సెల్ఫ్‌ రిజస్ట్రేషన్‌ లింక్‌ క్లిక్‌ చేస్తే ప్రసుతం చాలా మందికి ఓపెన్‌ కావడం లేదు. ఓపెన్‌ అయినా కూడా వివరాలు నమోదులో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నిబంధన ప్రకారం కొవిడ్‌ టీకా వేయించుకోవాలంటే ప్రతి వ్యక్తికి సెల్‌ఫోన్‌ ఉండాల్సిందే. మహానగరంలో లక్షలాదిమందికి ఈ సాంకేతిక వ్యవహారాలు తెలియవు. దీంతో వారు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం లేదు. పోనీ మీ సేవా కేంద్రాలకు వెళితే అక్కడ దీనికోసం డబ్బులు సమర్పించుకోవాల్సిందే. అక్కడా పెద్ద క్యూలు ఏర్పడి కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే అవకాశం ఉంది.  
మహానగరంలో దాదాపు మూడు లక్షలమందికి రెండో డోసు గడువు ముగిసేలా ఉంది.  ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్‌ చేసుకుని టీకా వేయించుకోవాలంటే కనీసం 20 రోజుల సమయం పడుతోందని అంటున్నారు. దీంతో రెండో డోసు గడువు ముగిస్తే అప్పటికే వేయించుకున్న మొదటి డోసు ఎందుకూ పనికిరాకుండా మారే ప్రమాదం ఉందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వందమందిని ఫలానా వ్యాక్సిన్‌ కేంద్రానికి వెళ్లి టీకీ వేసుకోవాలని సమాచారం ఇస్తే... ఆరోజు 70 మందికి సరిపడా డోసులే ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి? అని అధికారులు చెబుతున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకుని టీకా వేయించుకోని వారు మళ్లీ కొవిన్‌ యాప్‌లో తాజాగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మరో 20 రోజులో.. ఆపైనో ఆగాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్‌లో బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తే 20 రోజుల వరకు ఎటువంటి స్లాట్‌ లేనట్లుగా చూపిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని