Published : 05/05/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధరణి ఉందని.. ధర పలుకుతుందని

 నకిలీ పత్రాలతో బ్యాంకులకు బురిడీ

కోట్లాది రూపాయల రుణాలు స్వాహా

శంకరంపల్లి వద్ద విలువైన భూములు. బోడుప్పల్‌లో పరిశ్రమ. ఈ రెండింటినీ చూపుతూ ఓ వ్యక్తి బ్యాంకును బురిడీ కొట్టించాడు. రూ.20 కోట్ల వరకూ రుణాలు తీసుకున్నాడు. ఆ తరువాత చూపించిన ఆస్తులన్నీ బోగస్‌ అని గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత కూడా అదే బ్యాంకును మరో రెండుసార్లు మోసగించి భారీగా మార్టిగేజ్‌ రుణాలు తీసుకోవటం కొసమెరుపు.

మొయినాబాద్‌ వద్ద కోట్లు విలువైన స్థలాన్ని వ్యాపార విస్తరణకు డబ్బు అవసరమై తనఖా పెడుతున్నానంటూ జాతీయ బ్యాంకును నమ్మించాడు. కొందరు ఉద్యోగులకు సరదాల విందుతో ఖుషీ చేశాడు. ఇంకేముంది..పలుకుబడి ఉన్న ఆయనకు ఎంతైనా అప్పు ఇవ్వొచ్చంటూ క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఉద్యోగి కూడా ఆమోదముద్ర వేశాడు. రూ.10 కోట్లు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారు. కొన్నాళ్లు ప్రతినెలా క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు. అకస్మాత్తుగా మూడు నెలలుగా సదరు పెద్దమనిషి బ్యాంకు అధికారుల ఫోన్‌కూ చిక్కకుండా మాయమయ్యాడు. ఆ తరువాత రికవరీ ఏజెంట్‌ పరిశీలనలో అసలు అక్కడ స్థలమే లేదని తేలింది. ఉన్నతస్థాయి అధికారులను విషయం తెలియటంతో సిబ్బందిపై వేటు వేశారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాలర్‌ నలగకుండా దర్జాగా..

హంగూ..ఆర్భాటం..ఖరీదైన కార్లు. తాతలు సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్నట్టు హడావుడి. నకిలీపత్రాలు/నమ్మకస్తులను బ్యాంకు రుణాలు పొందేందుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. చెమట పట్టకుండా, కాలర్‌ నలగకుండా దర్జాగా కోట్లు కూడబెడుతున్నారు. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏటా సుమారు రూ.60 నుంచి 90 కోట్ల వరకూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టుగా కేసులు నమోదవుతుంటాయి. 2020లో నకిలీ పత్రాలతో రూ.61 కోట్లు రుణాలు పొందిన వారిపై 18 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 4 నెలల వ్యవధిలోనే పలు బ్యాంకులను రూ.218 కోట్ల మేర రుణాలు తీసుకుని, మోసగించినట్టు నగర సీసీఎస్‌కు ఆయా బ్యాంకుల నుంచి 6 ఫిర్యాదులు వచ్చాయి.

పక్కా వ్యూహంతో..

బ్యాంకులను బురిడీ కొట్టించేందుకు పక్కా వ్యూహం అనుసరిస్తారు. విలువైన భూములకు సంబంధించిన అసలు పత్రాలను సేకరిస్తారు. వాటిని పోలిన నకిలీ పత్రాలను తయారు చేయిస్తారు. పెద్ద మొత్తంలో రుణం పొందేందుకు అవసరమైన పత్రాలు, అడ్డంకులు తలెత్తకుండా ఉండే మార్గాలను కొన్నిచోట్ల బ్యాంకు ఉద్యోగులే చెబుతుంటారు. రెండేళ్ల క్రితం బోడుప్పల్‌కు చెందిన భార్యాభర్తలు పరిశ్రమ ఏర్పాటుకు ఓ ప్రముఖ బ్యాంకు నుంచి భారీ ఎత్తున రుణం తీసుకున్నారు. నాగోల్‌కు చెందిన సివిల్‌ ఇంజినీర్‌ కాలనీలోని ప్లాట్లను పలుమార్లు రిజిస్ట్రర్‌ చేయించి పలువురికి విక్రయించాడు. నకిలీ లేఅవుట్స్‌/మున్సిపల్‌ అధికారుల అనుమతులతో ప్రభుత్వ ఉద్యోగులను మోసగించాడు. భవన నిర్మాణాల పేరుతో సుమారు రూ.70లక్షల వరకూ బ్యాంకు నుంచి రుణం పొందాడు. కొన్ని కేసుల్లో మాయగాళ్లు మరింత తెలివిగా వ్యవహరిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, అత్యవసరంగా డబ్బు అవసరం అయిన వారిని పూచీకత్తు కోసం ఉపయోగించుకుంటున్నారు. తీసుకున్న రుణంలో కొంత కమీషన్‌గా ఇస్తామని ఆశ చూపటంతో ముందుకు వస్తున్నారు. బ్యాంకు రుణాలు సరిగా చెల్లించని సమయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని