Published : 12/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉపాధికి ఊతం

ఎస్సీ కార్పొరేషన్‌ రాయితీ పథకాలకు ఎంపిక

త్వరలో లబ్ధిదారుల గుర్తింపునకు కార్యాచరణ

న్యూస్‌టుడే, వికారాబాద్‌టౌన్‌: గ్రామీణ యువతకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం కల్పించాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగానే పథకాల్లో మార్పులకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దరఖాస్తులకు మోక్షం లభిస్తుందో లేదోనన్న ఆందోళన యువతలో నెలకొంది. తాజాగా అధికారులు తీసుకున్న నిర్ణయం వారిలో ఆశలు చిగురింపజేసింది.

ఈ ఆర్థిక సంవత్సరం ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలకు 300 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించింది. రూ.16.63 కోట్లు అంచనా వ్యయంతో బ్యాంకు అనుసంధాన రాయితీ రుణాలు అందజేస్తారు. మండలాలు, పురపాలికల వారీగా అర్జీలను పరిశీలించి ముఖాముఖి ద్వారా లబ్ధిదారులను ఎంపికచేస్తారు. యూనిట్‌ను బట్టి రాయితీ, బ్యాంకు రుణాలు మంజూరు చేయనున్నారు. ఆరు కేటగిరీల కింద రాయితీ యూనిట్ల మంజూరు ఉంటుంది. మొదటి దాంట్లో 11 పథకాలను బృందాలకు కేటాయించగా, 44 పథకాలను వ్యక్తిగతంగా ఇవ్వనున్నారు. రెండో కేటగిరిలో రవాణా వాహనాలు, మూడోది పాడిపరిశ్రమకు, నాలుగోది వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు, అయిదులో ఉద్యాన, పట్టుపరిశ్రమ ఏర్పాటుకు సాయం అందించనున్నారు. ఆరో కేటగిరి కింద చిన్ననీటి పారుదలను ప్రోత్సహిస్తారు. వ్యవసాయ బోరు, మోటారు, పైప్‌లైన్‌ తదితరాలకు రాయితీ మంజూరు చేస్తారు. నైపుణ్యంతో సంబంధం ఉన్న యూనిట్లకు జిల్లా స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ నేతృత్వంలో ముఖాముఖి నిర్వహించనున్నారు. మిగతా యూనిట్లకు మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. .

కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ..: కలెక్టరేట్‌లోని కార్యాలయంలో నైపుణ్యంతో సంబంధం ఉన్న యూనిట్లకు లబ్ధిదారుల ఎంపికకు ముఖాముఖి నిర్వహించాలని సంబంధిత అధికారులు భావించారు. ప్రస్తుతం కొవిడ్‌ వల్ల ఎంపిక వాయిదా వేశారు. తగ్గుముఖం పట్టగానే చేపట్టాలని యోచిస్తున్నారు. నిత్యం పరిమిత సంఖ్యలో అర్జీదారులను పిలువనున్నారు.

సమాచారం ఉన్నవారే రావాలి

బాబుమోజస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

కొవిడ్‌ కారణంగా స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు సంబంధించి ముఖాముఖి త్వరలో నిర్వహించనున్నాం. లబ్ధిదారుల ఎంపిక ప్రస్తుతం వాయిదా వేశాం. నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన వారు మాత్రమే హాజరు కావాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని