అనుమతిలేని దందా.. నిక్షేపానికి ఆపద!
logo
Published : 12/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుమతిలేని దందా.. నిక్షేపానికి ఆపద!

కొరవడిన తనిఖీలు

పట్టించుకోని గనుల శాఖ

సర్కారు ఆదాయానికి గండి

గోపాల్‌పూరు రెవెన్యూ శివారులో తవ్వకాలు

న్యూస్టుడే, పెద్దేముల్‌: సహజ సంపదకు ఆపద వాటిల్ల్లుతోంది. అనుమతులు లేకుండానే సుద్ద తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రాత్రి, పగలు ఈ దందా బహిరంగంగా జరుగుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. ముడి సుద్దను పొలాల్లో నిల్వ చేసి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నా గనులు, రెవెన్యూ అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీరంతా మామూళ్ల మత్తులో తూగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

జిల్లాలోని పెద్దేముల్‌ మండలంలో సుద్ద నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. ఎప్పుడో పదేళ్ల కిందట పొందిన అనుమతులను చూపుతూ వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. లీజు ఒక చోట ఉంటే తవ్వకాలు మరో చోట చేస్తున్నారు. గోపాల్‌పూరు, తింసాన్‌పల్లి రెవెన్యూ శివారులోని సర్వే సంఖ్యలు 53, 54, 48, 49, 18, 19, 30 భూముల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఒక సర్వే సంఖ్యలో ఐదు ఎకరాల భూమి ఉంట,ే ఎకరానికి అనుమతి పొంది మిగతా భూమిని అక్రమంగా తవ్వేస్తున్నారు. భారీ యంత్రాల రాకతో తవ్వకాలు వేగంగా జరిగిపోతున్నాయి. ఇక్కడి భూములను పరిశీలిస్తే గుంతలు తప్ప ఏమి కనిపించని పరిస్థితి ఉంది. ఒకసారి అనుమతి పొందాలంటే రూ.పది లక్షల వరకు ఖర్చు అవుతోంది. లీజుల విషయంలో సర్కారు స్పందించకపోవడంతో పాత అనుమతులను చూపుతూ అడిగేవారు లేరని తవ్వేస్తున్నారు.

వివాదస్పద భూములను అక్రమించి: సుద్ద వ్యాపారులు తమ సొంత భూములను పక్కనబెట్టి వివాదస్పద భూములపై కన్నేస్తున్నారు. తవ్వకాలు జరుపతున్న వారంతా రాజకీయ నాయకులు కావడంతో భూమిపై హక్కులు ఉన్న వారు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పదేళ్ల క్రితం భూములు పొందిన వారు నగరాల్లో ఉండటంతో నాయకులకు ఇదీ కలిసి వస్తోంది. రాత్రిరాత్రే యంత్రాలతో తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. తరుచూ భూవివాదాలు తలెత్తి పోలీసుల వరకు వెలుతోంది.

కుప్పలుగా పోసిన సుద్ద

మంచి డిమాండ్‌ ఉండటంతో.. విదేశాల్లో ముడి సుద్దకు మంచి డిమాండ్‌ ఉంది. మలేషియా, సింగపూరు దేశాలకు లక్ష టన్నులు ఎగుమతి చేస్తూ, వ్యాపారులు జేబులు నింపుకొంటున్నారు. ముడి సుద్దను నూనెలు, పెట్రోలు, డిజిల్‌ వంటి వాటిని శుద్ధి చేయడానికి, ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. సబ్బులు, బొమ్మల తయారీకి వాడుతారు. జోరుగా సాగుతున్న ఈ దందాపై అధికారులు మౌనంగా ఉండటంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికారులు, పోలీసులకు తరుచూ ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత పూర్వకంగా ఇవ్వాలని కొర్రీలు పెడుతున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

పరిశీలించి చర్యలు

ఫహీం ఖాద్రి, తహసీల్దారు, పెద్దేముల్‌

ఈ వ్యవహారంపై పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎవరినీ వదిలిపెట్టం.

క్షేత్రస్థాయిలో విచారిస్తాం

సాంబశివరావు, ఏడీ, గనుల శాఖ, తాండూరు

ఇప్పటి వరకు ఈ విషయం మా దృష్టికి రాలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. అక్రమ తవ్వకాలను గుర్తించి చర్యలు తీసుకుని జరిమానాలు విధిస్తాము.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని