వివరాలు లేక.. విక్రయం కాక!
logo
Published : 12/05/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివరాలు లేక.. విక్రయం కాక!

ధాన్యం అమ్మకానికి రైతన్నల అవస్థలు

అధికారులు దృష్టి సారిస్తే మేలు

 

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే, దౌల్తాబాద్‌


కొనుగోలు కేంద్రం వద్ద రైతులు

రైతు పండించిన ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించిన వారికి అవస్థలు తప్పడంలేదు. వ్యవసాయ శాఖ సిబ్బంది చేసిన తప్పులకు కర్షకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది చేసిన పొరపాట్లనే మరో సారి పునరావృతం చేశారు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి రైతులకు అవస్థలు తప్పడం లేదు. పంట ఒకరిది, కేంద్రాల్లో పేర్లు, బ్యాంకుల వివరాలు మరొకరివి వేసి అమ్ముకునే పరిస్థితి ఎదురవుతోంది. సీజన్‌ ప్రారంభంలో గ్రామంలో రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారు. ఎంత విస్తీర్ణం అనే వివరాలు నమోదు చేయడంలో వ్యవసాయ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 97 వ్యవసాయ క్లస్టర్లున్నాయి. వీటి పరిధిలో ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈఓను ప్రభుత్వం నియమించింది. రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారు? ఎంత విస్తీర్ణం? కౌలు రైతులు, పంట దిగుబడి, తదితర అంశాలను పరిశీలించి, ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికలు వీరు ఎప్పటికప్పుడు అందించాల్సి ఉంటుంది. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే విధి నిర్వహణలో వ్యవసాయ శాఖ సిబ్బంది ఉదాసీనత కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది రబీ సీజన్‌లో 70 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం కోత, పంట నూర్పిడి పనులు కొనసాగుతున్నాయి. సీజన్‌ ప్రారంభంలో గ్రామం, సర్వే నంబరు, విస్తీర్ణం వారీగా పంటల వివరాలు, రైతుల పేర్లు, ఆధార్‌ ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం అమ్ముకోవాలంటే మండల వ్యవసాయ అధికారి నుంచి ద్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో ఏ రకమైన పంటలు నమోదు చేసి ఉంటే దానికే పత్రాలు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి. కొంత మంది తమ పేరున పాస్‌ పుస్తకాలు, బ్యాంకు ఖాతాలు ఇచ్చి ఆన్‌లైన్‌లో వివరాలు లేని రైతులను ఆదుకుంటున్నా, మిగతా రైతులు అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు.

ఆందోళన వద్దు న్యాయం చేస్తాం

గోపాల్‌, వ్యవసాయ శాఖాధికారి.

ఈ సమస్య ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఉన్నతాధికారులకు వివరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకుంటాం. గతేడాది ఇలాగే ఎక్కడైనా రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోతే కొత్తగా నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారిని ఇబ్బంది పెట్టే పనిచేయం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయం చేస్తాం.

ఆన్‌లైన్‌లో నమోదు లేవంటున్నారు

మాణెమ్మ, దౌల్తాబాద్‌

రెండున్న ఎకరాల్లో వరి వేశాం. మంచి దిగుబడి వచ్చింది. మొత్తం 112 బస్తాలు అయ్యాయి. వానాకాలంలో పేరు, పంట వివరాలు నమోదు చేసుకున్నారు. యాసంగిలో మరో సారి నమోదు చేసుకోవాలన్న విషయాన్ని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళదామంటే ధుృవీకరణ పత్రాలు కావాలని అడుగుతున్నారు. వ్యవసాయ అధికారులను అడిగితే ఆన్‌లైన్‌లో మీ పేరు, పంట వివరాలు రావడం లేదని అంటున్నారు. ఇపుడు ఏం చేయాలో అర్థం కావడంలేదు.

ఖరీఫ్‌లో తీసుకున్నారు: మొగులప్ప

రెండు ఎకరాలు వరి వేశా. 90 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఖరీప్‌లో పంటల వివరాలు, పేరు నమోదు చేసుకున్నారు. రబీకి సంబంధించి ఆన్‌లైన్‌లో లేవంటున్నారు. యాసంగిలో కూడా నమోదు చేయించాలని తెలియదు. వ్యవసాయ అధికారులు చెప్పలేదు. దీంతో తెలిసిన వారి పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌, బ్యాంకు ఖాతా సంఖ్య ఇతర వివరాలు తీసుకుని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించాను. డబ్బులు వారి ఖాతాలో పడితే, నాకు ఇస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని