తాళం తప్పలేదు..!
logo
Published : 12/05/2021 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాళం తప్పలేదు..!

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

కరోనా వ్యాధి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల నగర ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు ఏర్పాట్లు, మినహాయింపులు ఇచ్చింది. నాలుగు గంటలపాటు వివిధ రకాల వ్యాపారాలను కొనసాగించడానికి అవకాశం ఇవ్వడంతో వ్యాపారవర్గాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో నగర ప్రజలు కూరగాయల నుంచి వివిధ రకాల వస్తువుల కొనుగోలుకు అవకాశం కల్పించారు.

పలు మినహాయింపులు..

గతేడాది మార్చి 23 నుంచి మే రెండో వారం వరకు లాక్‌డౌన్‌ కొనసాగింది. రెండో దశలో కరోనా విజృంభించడంతో మరోసారి రాష్ట్రంలో ఆంక్షలు విధించాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. గతంలో ఎటువంటి సడలింపులు ఇవ్వలేదు. అయితే బుధవారం నుంచి అమలయ్యే లాక్‌డౌన్‌ మాత్రం నిత్యం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు సర్కార్‌ అనుమతినిచ్చింది. ఉదయం పది గంటలలోపు కూరగాయలు, సరకులు కొనుగోలు చేసి ఇళ్లకు చేరాలి. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు కూడా అదే సమయలో తిరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే అన్ని రైళ్లు తిరుగుతాయి. వాటిపై ఎటువంటి ఆంక్షలు లేవు.

కొవిడ్‌ టీకా, పరీక్షలు యథావిధిగా..

ఇక మెడికల్‌ దుకాణాలు రోజంతా తెరిచే ఉంటాయి. కాబట్టి కొవిడ్‌ రోగులు ఎటువంటి ఆందోళన చెందకుండా మందులు కొనుగోలు చేయొచ్ఛు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు యథావిధిగా పని చేస్తాయి. ఇదే సమయంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌తోపాటు కరోనా పరీక్షలు కూడా యథావిధిగా జరుగుతాయి. వీటికోసం వెళ్లే వారిపై పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించరు.

రేషన్‌ తెరిచే ఉంటుంది..

జాతీయ రహదారులపై రవాణా వాహనాలకు ఎటువంటి ఆంక్షలు లేవు కాబట్టి లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర ధరలు పెరిగే అవకాశం లేదని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడిన వెంటనే కొన్ని రకాల వస్తువుల ధరలను వ్యాపారులు పెంచేశారు. రేషన్‌షాపులు తెరిచే ఉంచుతారు. ఇదే సమయంలో సినిమా థియేటర్లు, జిమ్‌లు, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు, స్విమ్మింగ్‌పూల్స్‌ తదితరమైనవన్నీ సర్కార్‌ ఆదేశాలతో మూతపడనున్నాయి. మరోవైపు లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల నిర్మాణ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇందులో పని చేసే వేలాది మంది కూలీలు, ఇతరులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

పోటెత్తిన ప్రయాణం

ఈ నెల 12 నుంచి 22 వరకూ లాక్‌డౌన్‌ విధిస్తున్న వేళ.. నగరంలో ఉన్న వారు స్వస్థలాలకు వెళ్లేందుకు పరుగులు పెట్టారు. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ స్టేషన్లలో రద్దీ కనిపించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్లకూ ప్రయాణికులు హడావుడిగా పరుగులు తీశారు. రిజర్వేషన్‌ ఉన్న వారిని మాత్రమే స్టేషన్లలోకి రైల్వే అధికారులు అనుమతించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అదనంగా బస్సులు కూడా సిద్ధంగా ఉంచామని రంగారెడ్డి ఆర్టీసీ ఆర్‌ఎం వరప్రసాద్‌ తెలిపారు. అంతర్రాష్ట్ర బస్సులను పూర్తిగా ఆపేశామని స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు మాత్రం బస్సులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ నడుపుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని