ప్రకటన రాగానే పరుగులు
logo
Published : 12/05/2021 03:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రకటన రాగానే పరుగులు

మద్యం దుకాణాలు, మార్కెట్ల ముందు బారులు


లక్డికాపూల్‌లోని ఓ మద్యం షాపు ముందు బారులుతీరిన ప్రజలు

ఈనాడు - హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ప్రకటన రావడంతోనే నగర జనం ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ నిత్యావసరాలు కొనుక్కోవడానికి సడలింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినా.. నగరం జనం పట్టించుకోలేదు. నగరంలో మరెక్కడా లేని రద్దీ మద్యం దుకాణాల ముందు కనిపించింది. గతేడాది మాదిరి మద్యం అమ్మకాలుండవని భావించిన మందుబాబులు కరోనా భయాలను పక్కన పడేసి.. ఒకరికొకరు నెట్టుకుంటూ..కౌంటర్ల దగ్గర ఎగబడి శక్తి కొద్దీ మందు నిల్వలు కొనుక్కునేందుకు పోటీ పడ్డారు.

మద్యం దుకాణాలు తెరుస్తారు.. : ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయని అబ్కారీ శాఖ ప్రకటించింది. ఆ మేరకు అమ్మకాలు కొనసాగుతాయని చెప్పినా మందుబాబులు పట్టించుకోలేదు.

కిక్కిరిసిన సూపర్‌ మార్కెట్లు..: లాక్‌డౌన్‌ ప్రకటనతో సూపర్‌ మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. కొనుగోలుదారులను నియంత్రించడం సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. వారం కాదు.. నెలకు సరిపడా సరకులు తీసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. టమాటా ఇతర కూరగాయలను కిలో రూ.10 వరకు పెంచి అమ్మారు.

రైతుబజార్లుంటాయి..: రైతుబజార్లు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ తెరిచే ఉంటాయని.. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. పండ్లు, కూరగాయలను తరలించడానికి కూడా ఎలాంటి ఆంక్షలు లేవు. కనుక.. రైతులు ఉదయం 10 గంటల వరకూ అమ్మకాలు జరుపుతారని ప్రకటించారు. రైతులు తిరిగి ఇళ్లకు, ఊళ్లకు చేరడానికి కూడా సొంత రవాణా సదుపాయం ఉంటే వారికి అనుమతి ఉంటుందని తెలిపారు. సంచార రైతుబజార్ల వాహనాలను పెంచి కాలనీలకు అమ్మకాలు జరిపే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తెలిపారు. ఒక్కసారిగా పోటెత్తిన కొనుగోలుదారులతో నగరంలోని దుకాణాలు ఖాళీ అయిపోయాయి. కొన్నిచోట్ల సూపర్‌ మార్కెట్లను సాయంత్రానికే మూసేశారు. మరోవైపు మద్యం దుకాణాల్లో చాలాచోట్ల సాయత్రం 7 గంటల లోపు నిల్వలన్నీ ఖాళీ అయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని