పడకలు లేవు.. లోనికి రానివ్వం!
logo
Updated : 12/05/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పడకలు లేవు.. లోనికి రానివ్వం!

గచ్చిబౌలి టిమ్స్‌లో కరోనా బాధితులకు అనుమతి నిరాకరణ

 

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: పటాన్‌చెరువు సమీపంలోని కిష్టారెడ్డిపేటకు చెందిన 54 ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులుగా హోంఐసోలేషన్‌లో ఉన్న అతనికి ఆయాసం అధికమైంది. ఆక్సిజన్‌ అవసరం కావడంతో అతన్ని మంగళవారం ఉదయం గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. ఆసుపత్రి ప్రధాన గేటు వద్దే టిమ్స్‌ సెక్యూరిటీ సిబ్బంది అంబులెన్స్‌ను నిలిపివేశారు. ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేవు, లోపలికి అనుమతించలేమంటూ చెప్పారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా పట్టించుకోలేదు. అధికారుల అనుమతి లేనిదే లోపలికి పంపించలేమన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోటు చెప్పుకోండి? అంటూ అసహనం వ్యక్తం చేశారు. వైద్యులకు పరిస్థితి వివరిస్తామని బాధితులు చెప్పినా వినలేదు. చేసేది లేక అక్కడి నుంచి రోగిని కొండాపూర్‌ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇది కేవలం ఒక్కరికి ఎదురైన అనుభవం కాదు, మంగళవారం పడకల కోసం టిమ్స్‌ ఆసుపత్రికి వచ్చిన చాలా మందికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఆసుపత్రి ప్రధాన గేటు వద్దే కరోనా బాధితులను అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి పడకల కోసం వచ్చిన వారు అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. టిమ్స్‌లో మొత్తం 1000 పడకలు ఉన్నాయని ఓ వైపు ఉన్నతాధికారులు చెబుతున్నా ఇక్కడ మాత్రం కేవలం 600 పడకలే అందుబాటులో ఉన్నాయని సమాచారం. ప్రసుత్తం అవన్నీ రోగులతో నిండిపోయాయి. ఇక ఐసీయూకు సంబంధించి మూడు వార్డుల్లో 130 పడకలు ఉండగా అవి ఎప్పటికప్పుడు నిండుతున్నాయి. ఫలితంగా కొత్తగా వచ్చే రోగులను చేర్చుకునే పరిస్థితి లేకుండా పోతోంది.

కొండాపూర్‌ ఆసుపత్రిలోనూ.. టిమ్స్‌ ఆసుపత్రిలో పడకల దొరకని వారు కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇక్కడ కూడా పడకలు లేవని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ వంద పడకలు సిద్ధం చేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇక్కడ 40 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొవిడ్‌ బాధితులకు చికిత్సకు అవసరమైన మౌలిక వసతులు ఇక్కడ లేకపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్న రోగులను చేర్చుకునేందుకు వైద్యులు వెనుకడుగు వేస్తున్నారు. ఆసుపత్రిలో వార్డుబాయ్‌లు, నర్సులు, వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. కరోనా చికిత్స అందించాలంటే కనీసం ఇక్కడ మరో 12 మంది వైద్యుల అవసరం ఉంది. నర్సులు, వార్డుబాయ్‌ల సంఖ్యను పెంచాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్‌ నిల్వలు సైతం లేవు. సీటీస్కాన్‌, ఎక్స్‌రే వంటి పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని