పోస్టు చేస్తారు.. గుబులు పుట్టిస్తారు
logo
Updated : 12/05/2021 04:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోస్టు చేస్తారు.. గుబులు పుట్టిస్తారు

సామాజిక మాధ్యమాల్లో వదంతుల హవా

ప్రతికూల ప్రకటనలతో కొత్త భయాలు

ఈనాడు, హైదరాబాద్‌

వాట్సాప్‌ పోస్టులు గుబులు పుట్టిస్తున్నాయి. ఫేస్‌బుక్‌ ప్రచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నలుగురి చూపు తనవైపు తిప్పుకోవాలనే ఆరాటం జీవితాలను తారుమారు చేస్తోందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అంశాలు అధికశాతం ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇటీవల ఓ వ్యక్తికి కళ్లకలక సమస్య ఎదురైంది. దానికి ఓ వైద్యుడు చెప్పిన సూచన అంటూ చికిత్స వివరాలు పంపాడు. రెండ్రోజులకు అది తీవ్రమైంది. నాలుగు రోజుల తరువాత పరీక్షలో కళ్లు ఎర్రబారేందుకు కొవిడ్‌ అసలు కారణంగా తేల్చారు. ఏ మాత్రం ఆలస్యమైనా అతడి ప్రాణాలు పోయేవేనని ఓ వైద్యుడు తన వద్దకు వచ్చిన రోగి పరిస్థితికి కారణాన్ని విశ్లేషించారు. నిమ్మకాయ రసం ముక్కులో పిండితే కరోనా మాయమంటూ తన వాట్సాప్‌ నెంబర్‌కే ప్రముఖ వైద్యుడొకరు సందేశం పంపడాన్ని ఉదహరించారు.


డాక్టర్‌ అనిత ఆరే

పుకార్ల వెనుక అసలు కథ

కొద్దిమందికి వదంతులు సృష్టించటం.. వాటిని విపరీతంగా ప్రచారం చేయటం అభిరుచి. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో ఈ తరహా మనస్తత్వం ఉన్న వారు మరింతగా చెలరేగుతుంటారని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధికశాతం ప్రజలు నెగెటివ్‌ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. సానుకూల అంశాలను పెద్దగా పట్టించుకోరు. మెదడు కూడా ప్రతికూల అంశాలను స్వీకరించేందుకు ఇష్టపడుతుందని కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు డాక్టర్‌ అనిత ఆరే తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనూ ఈ తరహా పోస్టింగ్‌లతో హల్‌చల్‌ చేస్తున్నవారు పెరుగుతున్న మాట నిజమేనన్నారు. తమ వైపు దృష్టి మళ్లించుకోవాలని ఆశపడే ‘అటెన్షన్‌ సీకింగ్‌ బిహేవియర్‌’ వ్యక్తులు ఇలాంటి ప్రతికూల వార్తలను విపరీతంగా ప్రచారం చేస్తుంటారన్నారు. కరోనా సమయంలో 80-90శాతం మంది ఇక్కడ కనిపించిన అంశాలను తమకు అన్వయించుకుని ఆందోళన/కుంగుబాటుకు గురవుతున్నట్లు ఆమె వివరించారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండటమే పరిష్కారమని సూచించారు.

అపోహలు సృష్టిస్తే కేసులు

- కె.వి.ఎం.ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌క్రైమ్‌ హైదరాబాద్‌

ప్రస్తుత పరిస్థితుల్లో అపోహలు సృష్టించి భయాలకు కారకులవుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఆందోళన కలిగించే అంశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. 6నెలల నుంచి 2 సంవత్సరాల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఎటువంటి ఆధారాల్లేకుండా పోస్టులు చేయటం, వాటిని ఫార్వార్డ్‌ చేయటం రెండూ నేరమే. విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా బాధ్యతగా ఉండాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని