సంక్లిప్త వార్తలు
logo
Updated : 12/05/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్లిప్త వార్తలు

ఉన్నతాధికారులకు లాక్‌డౌన్‌ పర్యవేక్షణ బాధ్యతలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయడానికి నగర పోలీసు ఉన్నతాధికారులకు ఆయా మండలాల బాధ్యతల్ని అప్పగిస్తూ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నగర అదనపు కమిషనర్‌ (క్రైమ్స్‌ అండ్‌ సిట్‌) శిఖాగోయల్‌ను తూర్పు మండలం ఇన్‌ఛార్జిగా, అలాగే పశ్చిమ, మధ్యమండలం బాధ్యతల్ని అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనీల్‌కుమార్‌కు, దక్షిణమండలం ఇన్‌ఛార్జిగా అదనపు పోలీసు కమిషనర్‌ (శాంతిభద్రతలు) డి.ఎస్‌.చౌహాన్‌, ఉత్తర మండలం బాధ్యతల్ని జాయింట్‌ పోలీసు కమిషనర్‌ (సీసీఎస్‌) అవినాశ్‌ మహంతిలకు అప్పగించారు. ఆయా మండలాల బాధ్యులైన అధికారులు రోజు ఉదయం 10 గంటల నుంచి వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో ఉంటూ లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తారని అన్నారు.


పార్కులకు మినహాయింపులు లేవు: జీహెచ్‌ఎంసీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలోని పార్కులన్నింటినీ మూసివేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. నగరంలో 650 పార్కులుండగా.. మిగతా వాటికి ఇచ్చినట్టుగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఉన్న మినహాయింపులేవీ వీటికి వర్తించవని స్పష్టం చేసింది. మళ్లీ ఆదేశాలు వెలువడే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొంది.


ఆక్సిజన్‌ అందక ఎవరూ చనిపోలేదు

ఈనాడు, హైదరాబాద్‌: ఆక్సిజన్‌ అందక గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిలో ఎవరూ చనిపోలేదని డైరెక్టర్‌ విమలా థామస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్యం విషమించి మాత్రమే మృతి చెందుతున్నారన్నారు. ప్రాణవాయువు అందక ఏడుగురు రోగులు చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. కాగా తగిన ఆక్సిజన్‌ సరఫరా లేక టిమ్స్‌లో ఏడుగురు చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ప్రత్యేకంగా టిమ్స్‌లో 20 వేల లీటర్ల ఆక్సిజన్‌ ట్యాంకు అందుబాటులో ఉందన్నారు. దీంతోపాటు దాన్ని తయారు చేసే ప్లాంట్‌ కూడా ఉందన్నారు. సరఫరా తగ్గినప్పుడు అత్యవసరంగా వినియోగించేందుకు సిలిండర్లు కూడా ఉన్నాయన్నారు.


అధిక ఫీజులు వసూలు చేయొద్దు: టీఏఎఫ్‌ఆర్‌సీ

ఈనాడు, హైదరాబాద్‌: సీబీఐటీ, ఎంజీఐటీ యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నట్లుగా ఎలాంటి అధిక ఫీజులను విద్యార్థులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రవేశాల, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) స్పష్టం చేసింది. ఈ విషయం హైకోర్టులో విచారణలో ఉన్నందున, తేలేవరకు అధిక ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశించింది. యాజమాన్యాలు ఏడాదికి రూ.44 వేల చొప్పున అదనంగా చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. లేకపోతే ఆన్‌లైన్‌ తరగతులు, మిడ్‌ టర్మ్‌ పరీక్షలకు అనుమతించేది లేదని హుకుం జారీ చేశాయి. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో టీఏఎఫ్‌ఆర్‌సీ మంగళవారం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు నాగటి నారాయణ, సీబీఐటీ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు వి.నర్సిరెడ్డి, వి.శ్రీనివాస్‌, ఎంజీఐటీ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు ఎస్‌.పద్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

 


ఫొటో, వీడియోగ్రాఫర్లను ఆదుకోవాలి

అంబర్‌పేట: కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఉపాధిని కోల్పోయిన ఫొటో, వీడియోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫ్రీలాన్స్‌ ఫొటో, వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. మంగళవారం అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఫ్రీలాన్స్‌ ఫొటో, వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, ప్రతినిధులు మినుపురి ఉదయ్‌కుమార్‌, కరుణాకర్‌గౌడ్‌, వీరేశ్‌, కుమార్‌ తదితరులు మాట్లాడారు. ఉచితంగా నిత్యావసరాలు, వడ్డీలేని రుణాలు, ఉచిత వైద్య సేవలను అందించి ఆదుకోవాలన్నారు.


టీఎన్నార్‌ కుటుంబానికి చిరంజీవి చేయూత

ఈనాడు, హైదరాబాద్‌: నటుడు, పాత్రికేయుడు టీఎన్నార్‌ కుటుంబానికి తక్షణ అవసరాల కోసం ప్రముఖ కథానాయకుడు చిరంజీవి రూ.లక్ష సాయం అందజేశారు. మంగళవారం టీఎన్నార్‌ భార్య, పిల్లలకి ఫోన్‌ చేసి పరామర్శించారు. ● టీఎన్నార్‌ సతీమణి అకౌంటులో రూ.50 వేలు సాయంగా జమ చేసినట్లు కథా నాయకుడు సంపూర్ణేష్‌బాబు ట్విటర్‌ వేేదికగా తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని