కొవిడ్‌ సేవలో బీబీనగర్‌ ఎయిమ్స్‌
logo
Published : 12/05/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ సేవలో బీబీనగర్‌ ఎయిమ్స్‌

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ పడకలు దొరకడమే గగనంగా మారింది. ఈ నేపథ్యంలో సేవలందించడానికి మరో ప్రభుత్వ ఆస్పత్రి సిద్ధం కాబోతోంది. బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో సరికొత్తగా 200 పడకల్లో కరోనా రోగులకు సేవలందించేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి చొరవతో ఇక్కడ కొద్ది రోజుల్లోనే కొవిడ్‌ సేవలు ప్రారంభంకానున్నాయి. కొత్తవాటిలో దాదాపు వంద వరకు వెంటిలేటర్‌ పడకలను ఏర్పాటు చేయాలంటూ మంత్రి కిషన్‌ రెడ్డి కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్‌, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఫోన్‌లో కోరారు. వారు సుముఖత వ్యక్తం చేశారు. మిగిలిన వంద పడకలను ఆక్సిజన్‌ పడకలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రస్తుతం గాంధీలో 650 వెంటిలేటర్లు, టిమ్స్‌లో 136 వెంటిలేటర్‌ పడకలు ఉన్నా.. ఒక్కటి ఖాళీగా లేదు. ఇప్పుడు ఎయిమ్స్‌లో వంద పడకల్లో వెంటిలేటర్ల ఏర్పాటుతో అనేకమంది పేద రోగులకు పూర్తి వైద్యం అందే అవకాశముంది. ఎయిమ్స్‌లో 80 వరకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎనిమిది వేల పీపీఈ కిట్లను, 20 వేల ఎన్‌95 మాస్కులు, వంద పల్స్‌ ఆక్సోమీటర్లను అందుబాటులో ఉంచనున్నారు. సత్వరమే ఈ సేవలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కిషన్‌రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సాధారణ కొవిడ్‌ రోగులకూ చికిత్స అందించేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

‘గాంధీ’లో 1235 కరోనా రోగులు

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో మంగళవారం నాటికి 1235 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. 650 వెంటిలేటర్లు, 600 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉండగా.. అవన్నీ దాదాపు నిండిపోయాయి. మంగళవారం 73 మంది డిశ్ఛార్జి అయ్యారు. బాధితుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అదనంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న 300 పడకలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని