TS news: వనస్థలిపురం కేంద్రంగా నకిలీ సీడ్స్‌
logo
Published : 10/06/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS news: వనస్థలిపురం కేంద్రంగా నకిలీ సీడ్స్‌

రూ.13 కోట్ల విలువైన మిరప విత్తనాలు స్వాధీనం

హైదరాబాద్‌: సూర్యాపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్ముతూ అమాయక రైతుల్ని మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ వనస్థలిపురం కేంద్రంగా ద్వారకా సీడ్స్‌ పేరుతో గత కొంతకాలంగా నిర్వహిస్తున్న అక్రమవ్యాపారం గుట్టు రట్టు చేశారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల విలువ రూ.13 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌ వనస్థలిపురంలో నివాసముండే మూలపాటి శివారెడ్డి అక్రమ దందాకు మూలకారకుడిగా పోలీసులు గుర్తించారు. గతంలో కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో పలు సీడ్స్‌ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో హైదరాబాద్‌లో ద్వారకా సీడ్స్‌ కంపెనీ ఏర్పాటు చేసుకుని విత్తనాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా కాలం చెల్లిన విత్తనాలను, నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ పత్రాలు లేకుండా హైబ్రీడ్‌ అంటూ మిర్చి, టమోటా, బెండ, దొండ, పుచ్చకాయ లాంటి 15 రకాల నకిలీ విత్తనాల్ని మార్కెట్‌లో అమాయక రైతులకు అంటగడుతున్నాడు. ఈనెల 6న చింతలపాలెం మండలంలో వీటిని గుర్తించిన పోలీసులు లోతుగా విచారణ జరిపి ఈ రాకెట్‌ను ఛేదించారు. శివారెడ్డి మహబూబాబాద్‌, సుజాతానగర్‌, వత్సవాయి, వైరా ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటు చేసి డీలర్లను నియమించుకుని ఈ దందా నడిపిస్తున్నట్టు వెల్లడైంది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 986 కిలోల మిరప విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.13 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. వీరిపై మొత్తం 11 కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, విత్తనాల్లో కలిపే రంగు, పలు యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌వినయ్‌ కృష్ణారెడ్డి , ఎస్పీ భాస్కర్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని