98 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు
logo
Published : 19/06/2021 00:47 IST

98 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

పాలనాధికారిణి పౌసుమిబసు

సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఇప్పటివరకు 98లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పాలనాధికారిణి పౌసుమి బసు తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా పాలనాధికారి కార్యాలయం నుంచి పౌర సరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్‌ నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షలో ఆమె పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంకా 20 వేల మెట్రిక్‌ టన్నుల వడ్లు విక్రయానికి రానున్నాయని తెలిపారు. వాటిని భద్రపరిచేందుకు కొత్త గోదాములకు అనుమతించాలని, ప్రస్తుతం ఉన్న వాటికి అద్దె మంజూరు చేయాలని కోరారు. హమాలీలకు చెల్లించాల్సిన డబ్బులను విడుదల చేయాలని పౌర సరఫరాల కమిషనర్‌ను కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు పాలానాధికారి మోతీలాల్‌, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి రాజేశ్వర్‌, పౌర సరఫరాల డీఏం విమల, మార్కెటింగ్‌ శాఖాధికారి సబిత తదితరులు పాల్గొన్నారు.

సమన్వయంతో ముందుకు సాగాలి: వికారాబాద్‌ ఎన్నెపల్లి చౌరస్తా నుంచి సమీకృత జిల్లా కార్యాలయం వరకు మొక్కలను నాటాలని పాలనాధికారిణి పౌసుమి బసు సూచించారు. శుక్రవారం భవన సముదాయపు పనులను ఆమె పరిశీలించారు. అటవీ, పురపాలక సంఘం, రహదారులు, భవనాల శాఖల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి వికారాబాద్‌ వెళ్లే రోడ్డు వరకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భవనం లోపలి భాగంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని అన్నారు. అనంతరం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించి టీకా వేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆసుపత్రి చుట్టూ మొక్కలను పెంచి ప్రహరీగా మార్చాలని ఆసుపత్రి డాక్టర్‌ రమ్యశ్రీకి సూచించారు. ఆమె వెంట జిల్లా అటవీ అధికారి వేణుమాధవరావు, రహదారులు, భవనాల శాఖ ఏఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని