79,583 ఇళ్లు సిద్ధం
logo
Published : 19/06/2021 02:03 IST

79,583 ఇళ్లు సిద్ధం

మార్చి 2022కి మరో 20,417 గృహాలు

అంబేడ్కర్‌నగర్‌ బస్తీలో పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం.. లక్ష్యానికి చేరువవుతోంది. మొత్తం లక్ష ఇళ్ల పనులు ప్రారంభిస్తే.. ఇప్పటివరకు 79 వేలు పూర్తయ్యాయి. కొల్లూరు, రాంపల్లి, అహ్మద్‌గూడ, డి.పోచంపల్లి తదితర ప్రాంతాల్లోని గృహాలు.. ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్నాయి. 40 ప్రాంతాల్లోని మురికివాడల్లో చేపట్టిన ఎనిమిది వేల పైచిలుకు ఇళ్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. 12 మురికివాడల్లోని 2,498 ఇళ్ల ప్రారంభోత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి. సనత్‌నగర్‌ నియోజకవర్గంఫలోని నాలుగు బస్తీల్లో రూ.58.5 కోట్లతో నిర్మించిన 784 ఇళ్లను మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించే ప్రక్రియ ఈ నెల చివరి వారంలో మొదలుకానుందని మంత్రి తలసాని, జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

బస్తీవాసులను ఒప్పించి.. గ్రేటర్‌లోని పేదలకు లక్ష.. రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2016 బల్దియా ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. 42 బస్తీలు ఇళ్ల నిర్మాణానికి అంగీకారం తెలిపాయి. రెండు కాలనీల్లో పనులు చేపట్టేందుకు సమస్యలు తలెత్తగా, మిగిలిన ప్రాంతాల్లో 8 వేలకుపైగా నిర్మాణాలు మొదలయ్యాయి. అవి చివరి దశలో ఉన్నాయని గృహ నిర్మాణ విభాగం సూపరింటెండెంట్‌ ఇంజినీరు కిషన్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఇప్పటి వరకు 79,583 ఇళ్ల నిర్మాణం పూర్తవగా, మిగిలినవాటిని 2022 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రాజెక్టు స్వరూపం..

● నిర్మించాలనుకున్న ఇళ్లు: లక్ష

● ప్రాజెక్టు వ్యయం: రూ.9714.59 కోట్లు

● ఎంపిక చేసిన ప్రాంతాలు: 111 (40 బస్తీలు)

● పూర్తయిన ఇళ్లు: 79,583

● వేర్వేరు దశల్లో ఉన్నవి: 17,288

● మొదలుకానివి: 3,129

● ఇప్పటి వరకు చేసిన ఖర్చు: రూ.6206.71 కోట్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని