పనికొచ్చేలా చేస్తాం.. పేదలకు ఇస్తాం
logo
Updated : 19/06/2021 04:56 IST

పనికొచ్చేలా చేస్తాం.. పేదలకు ఇస్తాం

ప్రాజెక్టు దియా’తో పాత సైకిళ్ల పునర్వినియోగానికి చర్యలు

హ్యాపీ హైదరాబాద్‌ సంస్థ సభ్యులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్య సంరక్షణలో భాగంగా నగరవాసుల జీవన విధానంలో సైకిళ్లను భాగం చేయాలనే సంకల్పంతో సాగుతోంది ‘హ్యాపీ హైదరాబాద్‌’ సంస్థ. సైక్లింగ్‌ రేసులు, వినూత్న కార్యక్రమాలు నిర్వహించే ఈ సంస్థ.. ఇప్పుడు ‘ప్రాజెక్టు దియా’ పేరిట పాత సైకిళ్లను పనికొచ్చేలా చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా మూలన పడ్డ పాత సైకిళ్లను బయటికి తీసి, వాటికి కొత్తరూపునిచ్ఛి. ఇంటి పనివాళ్లు, కూలీలు, కాపలాదారులు, చిరు వ్యాపారులు, పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వనుంది. తద్వారా నగర దారులపై సైకిళ్ల సంఖ్య పెరిగి, కాలుష్య కారక వాహనాల సంఖ్య తగ్గుతుందని భావిస్తోంది. పుణె నగరంలో ఆనంద్‌ అనే స్వచ్ఛంద కార్యకర్త స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.

* ‘‘కొవిడ్‌ ఆపత్కాలంలోనూ ఈ బృందం ‘రిలీఫ్‌ రైడర్స్‌’గా మారి ఎందరికో బాసటగా నిలిచింది. సాయం కావాలని సంప్రదించిన అందరి చెంతకు సైకిళ్ల మీదే చేరుకుని కావాల్సిన నిత్యావసరాలు, ఆహారం, పండ్లు తదితరాల్ని అందించింది. దాదాపు 200 మంది సభ్యులు ఈ మహత్కార్యంలో పాలుపంచుకోగా.. కొవిడ్‌ తగ్గుముఖం పడుతున్న తరుణంలోనూ ఈ సేవలు కొనసాగుతున్నాయి.’’

ప్రతి ఒక్కరు భాగం కావాలి..

- దినేశ్‌, హ్యాపీ హైదరాబాద్‌ సహ వ్యవస్థాపకుడు

నగరంలో నిత్యం పనుల కోసం వెళ్లేవారిలో చాలామంది ఇప్పటికీ కాలినడకనే నమ్ముకుంటున్నారు. అలాంటి వారికి ఈ కార్యక్రమం ఊతమిస్తుంది. పక్కన పడేసి పాడైపోతున్న సైకిళ్లను బాగు చేయించి, కొత్తగా మార్చి అవసరమున్నవారికి ఇవ్వాలనుకుంటున్నాం. ఇందులో ప్రతి ఒక్కరు భాగం కావాలి.

మంచి స్పందన వస్తోంది..

- సంతనా సెల్వన్‌, హైదరాబాద్‌ సైకిల్స్‌ మేయర్‌

నగరంలో ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు దాదాపు 50 మంది దాకా ముందుకొచ్చారు. మరో 200 మంది అవసరమున్న వారు సంప్రదించారు. దీన్ని మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లి.. అవగాహన పెంచుతాం.

సంప్రదించాల్సిన నంబర్లు: 9959771673, 9566170334


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని