ఎత్తులకు పైఎత్తులు
logo
Published : 19/06/2021 02:04 IST

ఎత్తులకు పైఎత్తులు

జనవరి, ఫిబ్రవరిలోనే నాసిరకం పత్తి విత్తనాల చేరవేత

నేరుగా ఏజెంట్ల ఇళ్లకే.. కర్నూలు కేంద్రంగా దందా

ఈనాడు, హైదరాబాద్‌: నాసిరకం విత్తనాలు పోలీసుల చేతికి చిక్కకుండా ఎత్తులకు పైఎత్తులు వేశారు. కొంచెం కొంచెం నేరుగా గ్రామాలకే పంపించినట్లు సైబరాబాద్‌ పోలీసులు తాజాగా తేల్చారు. ఈ ఏడాది శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు మొత్తం 11 కేసులను నమోదు చేశారు. అన్నింటిలోనూ నకిలీ విత్తనాలు ‘కర్నూల్‌’ నుంచే ఇక్కడికి సరఫరా అయినట్లు గుర్తించారు. మరింత లోతుగా ఆరా తీయగా గుంటూరులోనూ ఇలాంటి అడ్డాలున్నాయని వెల్లడైంది.

ఈసారి రూట్‌ మార్ఛి..

ఏటా నగర శివారులోని పాడుపడిన భవనం, మూతపడిన పరిశ్రమ లేదా ఫాంహౌస్‌లను అడ్డాగా మార్చుకునేవారు. ఎక్కడెక్కడి నుంచో నాసిరకం పత్తి, ఇతర విత్తనాలను బల్క్‌గా ఈ అడ్డాలకు తీసుకొచ్చేవారు. అనంతరం వేర్వేరు బ్రాండ్ల పేరిట ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లో విక్రయించేవారు.పోలీసులు గతేడాది ఎక్కడికక్కడ దాడులు చేసి వారి ఆట కట్టించారు. దీంతో అక్రమార్కులు ఈసారి రూట్‌ మార్చారు. జనవరి, ఫిబ్రవరిలోనే నకిలీ విత్తనాలను గమ్యస్థానాలకు చేర్చేశారు. అక్కడే ప్యాకింగ్‌ చేసి గ్రామాలు, పట్టణాల వారీగా కొందరు ఏజెంట్లను నియమించుకున్నారు. ఒక్కొక్కరికి 100-200 వరకు ప్యాకెట్లను మాత్రమే ఇచ్చారు. ఒక్కో ప్యాకెట్‌ను విక్రయించినందుకు రూ.150-200 వరకు కమిషన్‌ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఆ గింజలను యాసిడ్‌తో శుద్ధి చేసి...

గద్వాల జిల్లాలో పండించిన పత్తిని ఎక్కువగా కర్నూలు జిల్లాలోని స్పిన్నింగ్‌ యజమానులు తీసుకుంటారు. మిల్లులో పత్తిని తీసిన తర్వాత మిగిలిన గింజలను ఈ అక్రమార్కులు సేకరిస్తున్నారు. వాటిని యాసిడ్‌తో శుద్ధి చేస్తున్నారు. అలా చేయడం వల్ల వాటికి ఉన్న పత్తి పోయి నిగనిగలాడుతూ కనిపిస్తాయి. వీటిని నంద్యాల, మంత్రాలయం తదితర ప్రాంతాల్లోని అడ్డాలకు తరలిస్తున్నారు. అక్కడే నిల్వ ఉంచి ఏదో ఒక బ్రాండ్‌ పేరిట ప్యాకింగ్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి శివారు ప్రాంతాలకు.. అటు నుంచి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని