40 ఎకరాలు.. రూ.56 కోట్లు!
logo
Published : 19/06/2021 02:04 IST

40 ఎకరాలు.. రూ.56 కోట్లు!

నకిలీ పత్రాలతో విక్రయించేందుకు యత్నం

రూ.8.5 కోట్లు అడ్వాన్స్‌.. వాట్సాప్‌లో సేల్‌డీడ్‌

అయిదుగురి అరెస్ట్‌

నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి రూ.56 కోట్ల విలువైన వ్యవసాయ భూముల్ని విక్రయించేందుకు యత్నించిన ఓ ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారి సహా అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల దగ్గరి నుంచి 67 పట్టాదారు (ఉమ్మడి ఏపీ, ఏపీకి సంబంధించిన) పాస్‌ పుస్తకాలు, 91 డాక్యుమెంట్లు, నకిలీ ఓటర్‌, రేషన్‌ కార్డులు, రబ్బరు స్టాంపులు, 264 స్టాంప్‌ కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను శుక్రవారం సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు.

మోసం ఎలా బయటపడిందంటే

వెంచర్‌ను అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రాంతంలో స్థలం చూపించాలని బాధితుడు (స్థిరాస్తి వ్యాపారి) పశ్చిమ గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడా గ్రామానికి చెందిన పిడుగు ఆదినారాయణ మూర్తిని అడిగాడు. ఆదినారాయణ మూర్తి పదిహేడేళ్ల కిందట హైదరాబాద్‌కొచ్చి స్థిరపడి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. మహేశ్వరం మండలం గొల్లూరులోని 40 ఎకరాల వ్యవసాయ భూమిని బాధితుడికి చూపించాడు. అసలు యజమానుల నుంచి తను లే అవుట్‌ను అభివృద్ధి చేసేందుకు జయ దశరథి ప్రాజెక్ట్స్‌ పేరిట కొనుగోలు చేసినట్లు నమ్మించాడు. ఎకరానికి రూ.1.4 చోట్ల చొప్పున మొత్తం రూ.56 కోట్లకు ఒప్పందం కుదిరింది. బాధితుడు అడ్వాన్స్‌గా రూ.8.5 కోట్లను 2019 జూన్‌ 7న చెల్లించాడు. తన పేరుపైన సేల్‌డీడ్‌ చేయించాలని బాధితుడు ఒత్తిడి తెచ్చాడు. అప్పుడు నిందితుడు వాట్సాప్‌లో బాధితుడి పేరుపైన రిజిస్టర్‌ చేయించిన సేల్‌డీడ్‌ ఫోటోను పంపించాడు. అసలు ధ్రువీకరణ పత్రాలను పంపించమంటే రేపు.. మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో బాధితుడికి అనుమానం వచ్చి మహేశ్వరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ‘సేల్‌డీడ్‌’ గురించి ఆరా తీయగా అది నకిలీదని తేలడంతో కూకట్‌పల్లి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఆ కేసు అక్కడి నుంచి సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగాని(ఈవోడబ్ల్యూ)కి బదిలీ అయ్యింది.

ఖాళీ స్థలం కనిపిస్తే అంతే

ఈవోడబ్ల్యూ అధికారులు రంగంలోకి దిగి ఆరా తీయగా అసలు యజమానులు అమెరికాలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు వారికి విషయం చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారని సీపీ సజ్జనార్‌ వివరించారు. ఆదినారాయణ మూర్తి ఖాళీ స్థలాలు కనిపిస్తే అక్కడ నకిలీ పత్రాల (పట్టాదారు పాస్‌ పుస్తకాలు, సేల్‌డీడ్‌, ఆధార్‌, ఓటర్‌ ఐడీ తదితరాలు)ను సృష్టించి విక్రయిస్తున్నట్లు తేల్చారు. ఇందుకోసం అమీర్‌పేట్‌లో కార్యాలయం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అందరినీ నమ్మించేందుకు అమీర్‌పేట్‌, కృష్ణానగర్‌, కోకాపేట్‌లో ఏడు డమ్మీ కంపెనీలను సృష్టించాడు. నకిలీ పత్రాలను సృష్టించడంలో అతని దగ్గర పనిచేసే తవ్వ వెంకట మురళీ కృష్ణ(43), కేశంపేట్‌ మండలం ఇప్పాలపల్లికి చెందిన పిప్పాల యాదయ్య(45), షాద్‌నగర్‌కు చెందిన హోటల్‌ పరివార్‌ యజమాని కుంబర్తి రాము(40), మహేశ్వరంలోని డాక్యుమెంట్‌ రైటర్‌ వడ్డి అశోక్‌(33)లను అరెస్ట్‌ చేసినట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని