అల్లం అమ్మకాలు.. రేషన్‌ బియ్యం కొనుగోలు!
logo
Published : 23/06/2021 01:46 IST

అల్లం అమ్మకాలు.. రేషన్‌ బియ్యం కొనుగోలు!

జిల్లాలో కొనసాగుతున్నఅక్రమ దందా

వ్యవసాయ క్షేత్రాల్లో నిల్వలు

అర్ధరాత్రి వాహనాల్లో తరలింపు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: పరిగి, న్యూస్‌టుడే: పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు బడా వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి అత్యధిక ధరకు అమ్ముకుంటూ జేబులు నింపుకొంటున్నారు. ఈ అక్రమ రవాణాపై నిత్యం కేసులు నమోదు చేస్తున్నా.. వారిలో మార్పు కనిపించడం లేదు. మరో వైపు జిల్లాకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు ఈ దందాకు తోడ్పాటు అందిస్తున్నారని విశ్వసనీయమైన సమాచారం. ఇటీవల కొన్ని వ్యవసాయ క్షేత్రాల్లో లభించిన నిల్వలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు కేసులు నమోదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాహన డ్రైవర్లపై కేసులతో సరిపెట్టేస్తున్నారు. అనంతరం ఈ వ్యవహారం సాఫీగా సాగిపోతోంది.

జిల్లా వ్యాప్తంగా 588 రేషన్‌ దుకాణాలు, 2.35 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం నెలకు 13వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌ ప్రభావంతో బియ్యం ఒకరికి 15 కేజీలు ఇస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 80 శాతం ప్రజలు రేషన్‌ బియ్యాన్ని వినియోగించే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అత్యధిక శాతం రైతులు బియ్యం పండించినవే వాడుతున్నారు. మరో వైపు చౌక బియ్యానికి డిమాండ్‌ పెరగడంతో అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. కిలో రూపాయికే ప్రభుత్వం అందిస్తుండగా, కొనుగోలుదారులు రూ.15 చెల్లిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని పలువురు రాజకీయ నాయకుల వ్యవసాయ క్షేత్రాల్లో నిల్వ చేసుకుని, ఎవరికి అనుమానం రాకుండా అర్ధరాత్రి సరిహద్దులు దాటించేస్తున్నారు. పరిగి దోమ, కుల్కచర్ల, యాలాల, తదితర మండలాలను కేంద్రాలుగా చేసుకుని అక్రమ వ్యాపారం చేస్తున్నారు. కోళ్ల దానా పరిశ్రమలు, బియ్యం నూకలతో మద్యం తయారు చేసే కంపెనీలు, రైస్‌ మిల్లుల యాజమాన్యాలు లెవీలో కలిపి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని సమాచారం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విరివిగా చౌక బియ్యం సేకరించేందుకు ప్రత్యేకంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం పేరిట గ్రామాల్లో సంచరించేలా చేస్తున్నారు. ఇటీవల అల్లం, వెల్లుల్లి, చింతపండు ఆటోల్లో అమ్ముతూ, రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు తేలింది.●

* వారం కిందట పరిగిలో 39 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా బియ్యం దందాలో కొత్త విషయం వెలుగు చూసింది. యాదాద్రి జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన కొంత మంది అల్లం, వెల్లుల్లి అమ్మకానికి ఆటోల్లో గ్రామాలు తిరుగుతూ.. అదే సమయంలో పేదల నుంచి చౌక బియ్యం కొనుగోలు చేస్తున్నారని గుర్తించారు. సేకరించిన వీటిని గుట్టుగా కర్ణాటక సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారని తేలింది.

* యాలాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏప్రిల్‌ 12న 98 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పట్టుకుంది. జహీరాబాద్‌ తరలిస్తున్నామని డీసీఎం డ్రైవర్‌ తెలిపాడు. బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

* దోమ మండలం మోత్కూరు నుంచి కుల్కచర్లకు ఆటోలో తరలిస్తున్న 9 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా, అదే రోజు యాలాల మండల పరిధిలో కొడంగల్‌ తరలిస్తున్న మరో 6 క్వింటాళ్లను పట్టుకున్నారు.

పరిగిలో స్వాధీనం చేసుకున్న బియ్యం వాహనం

కుటుంబాల కంటే కార్డులే ఎక్కువ

జిల్లాలో ఇటీవల నిర్వహించిన జ్వర సర్వేలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.23 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. రెండేళ్ల కిందటే 2.35 లక్షల రేషన్‌ కార్డులు ఉండటం విశేషం. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు, కారు, ఏసీలు, బంగ్లాలు ఉన్న కోటీశ్వరులు సైతం రేషన్‌ కార్డులు పొందారు. వీరంతా ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాల కోసం తప్ప, బియ్యం కోసం కార్డులను వినియోగించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం మరో ఏడు వేల దరఖాస్తుల పరిశీలనకు అధికారులు సిద్ధమవుతున్నారు. అర్హులైన వారికి అవకాశం కల్పించి, అనర్హులను తొలగించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

నిత్యం దాడులు నిర్వహిస్తున్నాం

రాజేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి

జిల్లాలో బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు నిత్యం దాడులు నిర్వహిస్తున్నాం. పోలీసు, రెవెన్యూ సిబ్బంది సైతం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తున్నాం. ప్రజలు కూడా సమాచారం ఇస్తే సత్వరం చర్యలు తీసుకుంటాం. పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి మాత్రమే కొత్త కార్డులు ఇస్తాం. అనర్హులను తొలగిస్తాం.

జిల్లాలో ఇలా

ఈ ఏడాది నమోదైన కేసులు: 22

స్వాధీనం చేసుకున్న బియ్యం 320 క్వింటాళ్లు

విలువ: సుమారు రూ.4.5 లక్షలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని