వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు
logo
Published : 23/06/2021 01:46 IST

వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు

పురపాలక సమావేశంలో తీర్మానం

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న అధ్యక్షతన మంగళవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను ఇన్‌ఛార్జి కమిషనరు అశోక్‌ కుమార్‌ విలేకరులకు వివరించారు. హరితహారం, కాలానుగుణ వ్యాధుల నివారణ చర్యలపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. పట్టణ వ్యాప్తంగా 50 వేల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని, వార్డుకో ఉద్యానం ఏర్పాటు చేయటానికి కౌన్సిలర్లు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని కౌన్సిల్‌ తీర్మానం చేసిందన్నారు. పట్టణ ప్రగతి నిధుల్లో 10 శాతం మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అంటు వ్యాధుల భారిన పడ కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు, ఈగలు ఉత్పత్తి కాకుండా మురుగు గుంతల్లో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమస్యలపై కౌన్సిలర్లు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకు వెళ్లారు.

కనీస వసతులపై ప్రత్యేక దృష్టి: సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు అందించటానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కౌన్సిలర్ల వాగ్వాదం: పురపాలక సంఘం అధ్యక్షురాలు స్వప్న అధ్యక్ష కుర్చీలో కూర్చోవడంపై దుమారం చెలరేగింది. ప్రారంభంలోనే సీపీఎం ఫ్లోర్‌ లీడరు మహమ్మద్‌ అసీఫ్‌ అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడరు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలరు ప్రభాకర్‌గౌడ్‌, తెజస ఫ్లోర్‌ లీడరు సోమశేఖర్‌ ఆయనకు మద్దతు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేశారని ఆమెపై కేసు నమోదైందని అధ్యక్ష స్థానంలో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. ఇదే క్రమంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. అధ్యక్షురాలిపై అభియోగమే తప్ప నిర్ధారణ కాలేదని అధికార పక్షం కౌన్సిలర్లు పేర్కొన్నారు. కేసు తేలేదాకా ఆమె కొనసాగటానికి వీలు లేదని సీపీఎం ఫ్లోర్‌ లీడరు అభ్యంతరం చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వారికి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధ్యక్షురాలు, ఆర్డీఓ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని