అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
logo
Published : 23/06/2021 01:46 IST

అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

దామస్తాపూర్‌లో సర్పంచితో మాట్లాడుతున్న కలెక్టర్‌

మర్పల్లి, న్యూస్‌టుడే: గ్రామాల్లో వివిధ పథకాల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాలనాధికారిణి పౌసుమిబసు హెచ్చరించారు. మంగళవారం కొత్లాపూర్‌, దామస్తాపూర్‌, రావులపల్లిల్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కృష్ణనన్‌తో కలిసి సందర్శించారు. దామస్తాపూర్‌లో వైకుంఠధామం పనులు పూర్తి చేయకపోవడంతో సర్పంచి జైపాల్‌రెడ్డి, పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు ముగిసినా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తూ సర్పంచి, సంబంధిత అధికారికి తాఖీదులు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారిణి రిజ్వానాను ఆదేశించారు. సర్పంచులు బాధ్యతగా వ్యవహరిస్తేనే పురోగతి సాధ్యమన్నారు. కొత్లాపూర్‌లో వైకుంఠధామం, నర్సరీ, కంపోస్టు షెడ్‌ తదితరాలను పరిశీలించారు. నర్సరీలో రిజిస్టరు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆసంతృప్తి వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించి, సేకరించాలన్నారు. వర్షాకాలం వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, పరిసరాల పరిశుభ్రత, తాగు నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారుల పక్కన తవ్విన గుంతలు సక్రమంగా లేకపోవడంతో సాంకేతిక సహాయకుడికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రావులపల్లిల్లో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి బాగుందని సర్పంచి దేవమ్మను అభినందించారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వరప్రసాద్‌, మండల పరిషత్‌ అధ్యక్షులు లలిత, ఇన్‌ఛార్జి ఎంపీడీఓ వెంకట్‌రాం గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని