అన్నదాతల అభ్యున్నతికి కృషి: ఎమ్మెల్యే
logo
Published : 23/06/2021 01:46 IST

అన్నదాతల అభ్యున్నతికి కృషి: ఎమ్మెల్యే

సయ్యద్‌పల్లిలో వైకుంఠధామం ప్రారంభిస్తున్న మహేష్‌రెడ్డి

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: అన్నదాతల అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి మండల పరిధిలోని రాపోల్‌, సయ్యద్‌పల్లి, చిగురాల్‌పల్లి, రంగాపూర్‌ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను, సయ్యద్‌పల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా వేదిక పరిసరాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతువేదికల్లో అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. కల్తీ విత్తనాలను అమ్మేవారిపై సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. గ్రామానికి తారురోడ్డు సౌకర్యం కల్పించాలని సయ్యద్‌పల్లి, చిగురాల్‌పల్లి ప్రజలు ఎమ్మెల్యేను కోరగా.. వెంటనే స్పందించిన ఆయన రెండు గ్రామాలకు నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ హరిప్రియ, పరిగి పురపాలిక ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌, ఆయా గ్రామాల సర్పంచులు, రైతు బంధు మండల కన్వీనర్‌ రాజేందర్‌, సహకార ఛైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాపోల్‌లో అడ్డుకున్న గ్రామస్థులు

మండల పరిధిలోని రాపోల్‌ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే మహేష్‌రెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్నారు. రైతులు పొలాలకు వెళ్లే పానాది రోడ్డును బాగు చేయాంచాలని, వాగుకు వంతెన కట్టించాలని పలువురు యువకులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు గ్రామ యువకుల మధ్య వాగ్వాదం నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. స్పందించిన ఎమ్మెల్యే అనుచరులను, గ్రామస్థులను సముదాయించారు. రోడ్డు పనులను ఈ రోజే చేపడదామని గ్రామస్థులతో కలిసి అక్కడికి చేరుకుని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. త్వరితగతిన పూర్తిచేయించి రైతుల సమస్యను తొలగిస్తామని హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని