ఓగీపూర్‌ గనుల్లో నిఘా బృందం తనిఖీలు
logo
Published : 23/06/2021 01:46 IST

ఓగీపూర్‌ గనుల్లో నిఘా బృందం తనిఖీలు

ఓగీపూర్‌(తాండూరుగ్రామీణ), న్యూస్‌టుడే: ఓగీపూర్‌ గనుల్లో నల్గొండ జిల్లా నుంచి వచ్చిన నిఘా విభాగం అధికారుల బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించింది. విజిలెన్సు సహాయక జువాలజిస్టు రాంబాబు, సీఐ మహేష్‌ ఆ ప్రాంతాన్ని సందర్శించి సర్వే సంఖ్య 129లోని ప్రభుత్వ భూముల్లో జరిపిన తవ్వకాలను పరిశీలించారు. పలుచోట్ల మండల సర్వేయర్‌ శ్రీహరితో కొలతలు తీయించి వివరాలు నమోదు చేశారు. 2019లో అనుమతులు(లీజు) ముగిసిన గనిలో నాపరాయి తవ్వకాలు జరిపి తరలించినట్లు గుర్తించారు. విద్యుత్తు కనెక్షన్‌ వివరాలను ఆరా తీయగా ఓగీపూర్‌కు చెందిన సిద్ధప్పపటేల్‌దిగా వెల్లడించారు. అనుమతులు ముగిసినప్పటికీ తవ్వకాలు జరిపినందున పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేశారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి సదరు తవ్వకందారునికి పదింతల అపరాధ రుసుం విధించి వసూలు చేయిస్తామన్నారు. బుధవారం కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారి వెంట గనుల శాఖ ఆర్‌ఐ రమేష్‌, గిర్దావర్‌ రాజురెడ్డి, వీఆర్‌ఏ నరేందర్‌ ఉన్నారు.

ఒకరోజు ముందే సమాచారం: తనిఖీ చేస్తారన్న సమాచారం ఒకరోజు ముందుగానే ఓగీపూర్‌, కరణ్‌కోట, మల్కాపూర్‌, కోటబాస్పల్లిలో కొందరు గనుల యజమానులు, నిర్వాహకులకు చేరింది. దీంతో ప్రభుత్వ భూముల్లో అనుమతులు(లీజు) లేకుండా తవ్వకాలు చేపట్టే అక్రమార్కులు అక్కడినుంచి జారుకున్నారు.

అక్రమ విద్యుత్తు కనెక్షన్‌లపై ఆరా

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: నాపరాయి గనుల్లో అనుమతుల్లేకుండా తవ్వకాలు జరిపేందుకు వినియోగించిన అక్రమ విద్యుత్‌ కనెక్షన్‌లపై నిఘా విభాగం అధికారుల బృందం మంగళవారం లోతుగా విచారించింది. ప్రధానంగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా తవ్వకాలు చేపట్టిన ప్రదేశాలను ఉదయం 10 నుంచి రాత్రి 7గంటల వరకు పరిశీలించారు. సర్వే సంఖ్య 129లోని ప్రభుత్వ భూముల్లో మూడుచోట్ల అక్రమంగా తవ్వకాలు చేపట్టి నాపరాయి తరలించినట్లు తేల్చారు. అందుకు వినియోగించిన మూడు విద్యుత్‌ కనెక్షన్లు ఎవరి పేరిట ఉన్నాయనే వివరాలను తాండూరు మండల ట్రాన్స్‌కో కార్యాలయానికి చేరుకుని ఏఈ రంగారెడ్డి సమక్షంలో దస్త్రాలను పరిశీలించారు. ఈక్రమంలో ముగ్గురిని గుర్తించగా వారిలో ఒకరు మృతి చెందారని విచారణలో తేలింది. మరొకరు మహారాష్ట్రలో ఉంటున్నట్లు గుర్తించారు. ఇంకొకరిని ఓగీపూర్‌లో విచారించి వివరాలను నమోదు చేసుకున్నారు. మృతి చెందిన వ్యక్తి పేరిట విద్యుత్తు కనెక్షనతో అక్రమంగా నాపరాయి తవ్వకాలు చేపట్టడాన్ని నిఘా బృందం తప్పుబట్టింది. ఇంకొకరు స్థానికంగా లేకున్నా అతడి పేరిట ఉన్న విద్యుత్‌ కనెక్షన్‌తో ఇతరులు తవ్వకాలు చేపట్టి నిక్షేపాలను తరలించినట్లు నమోదు చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి బాధ్యులపై చర్యలు చేపడతామని, అపరాధ రుసుం విధించి రాబడతామని అధికారులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని