భూకేటాయింపుల ఉత్తర్వులు సమర్పించండి
logo
Published : 23/06/2021 02:15 IST

భూకేటాయింపుల ఉత్తర్వులు సమర్పించండి

పుప్పాలగూడ భూములపై ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ మండలం పుప్పాలగూడలోని సర్వే నం.452/1లో భూమిని హెచ్‌ఎండీఏ (అప్పటి హుడా)కు కేటాయించిన ఉత్తర్వులను సమర్పించాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూమిని కేటాయించినపుడు ప్రొసీడింగ్స్‌ జారీ చేయాలని, ఆ తరువాతే పంచనామా నిర్వహించి భూమిని కేటాయించాలని పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులను సమర్పించాలని ఆదేశించింది. అదేవిధంగా సర్వే నెం.452/2లో కొనుగోలు చేసిన 11.37 ఎకరాలపై వారికి ఉన్న హక్కుల వివరాలను సమర్పించాలని ప్రైవేటు వ్యక్తులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. పుప్పాలగూడలో తాము కొనుగోలు చేసిన భూములపై సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని, ఆ భూమిని తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ కాకతీయ ఎన్‌క్లేవ్స్‌ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని, భూమిని ఖాళీ చేయించరాదంటూ 2008లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హెచ్‌ఎండీయే 2010లో అప్పీలు దాఖలు చేసింది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ 452/1లో సుమారు 174 ఎకరాల భూమి ఉందని, ప్రభుత్వానికి చెందిన ఈ భూమిని హెచ్‌ఎండీఏకు అప్పగించామని చెప్పారు. ఈ భూమిని పంచనామా చేసి అప్పగించినప్పుడు 452/2 సర్వే నంబరు లేదన్నారు. సింగిల్‌ జడ్జి ఆదేశాల మేరకు సర్వే నిర్వహించారని, అప్పుడు హెచ్‌ఎండీఏకు నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. ప్రైవేటు వ్యక్తుల తరఫు న్యాయవాది సురేష్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఈ భూమిని 2005లో కొనుగోలు చేశామని, రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్‌ చేయించామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తమ భూమి అంటూ ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై ధర్మాసనం హెచ్‌ఎండీఏకు భూమిని అప్పగించిన ప్రొసీడింగ్స్‌ను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని